పాతమంచిర్యాల: సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆటోడ్రైవర్లు సమ్మె చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో బంద్ కొనసాగుతుందని ఆటో డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్, ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్, బీఎంఎస్, హెచ్‌ఎంఎస్ ఆటో యూనియన్లు, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జేఏసీ నాయకులు ప్రకటించారు. మంచిర్యాల జిల్లాలో 10,200 ఆటోలు ఉన్నాయి. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్ల జీవితాలు దుర్భరంగా మారాయని, చాలీచాలని ఆదాయంతో కుటుంబాలను పోషించలేకపోతున్నామని వాపోతున్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు, వాహనాల మరమ్మతులు, ఫైనాన్స్, బ్యాంకు రుణాలు, ఫిట్‌నెస్ చార్జీలు పెరుగతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం అమలుతో ఆటోలకు గిరాకీ తగ్గి ఆదాయం పడిపోయిందని ఆటోడ్రైవర్లు వాపోతున్నారు. ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటోడ్రైవర్ల కుటుంబాలకు నెలకు రూ.12వేలు, సంక్షేమ బోర్డు ఏర్పాటుకు జీవో జారీ చేయాలని అంటున్నారు. ఆటో కార్మికులకు పింఛన్, కార్పొరేట్ వైద్యం, పట్టణాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ ఆటో జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గాజుల ముఖేష్‌గౌడ్, జేఏసీ నాయకులు శనివారం హైదరాబాద్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిసి కోరారు.
సమస్యలు పరిష్కరించాలి
ఆటోడ్రైవర్లకు రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆటోడ్రైవర్ల సంక్షేమంపై పట్టించుకోకపోవడం దారుణం. ఆర్థిక ఇబ్బందుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 204మంది ఆటో కార్మికులు చనిపోయినా ప్రభుత్వం గానీ అధికారులు గానీ పరామర్శించకపోవడం బాధాకరం. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం, జీవనోపాధి కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో రహదారులు దిగ్బంధం చేసి ఉద్యమిస్తాం. – గాజుల ముఖేష్‌గౌడ్,
తెలంగాణ ఆటో జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు


