బెల్లంపల్లి: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో వంటింట్లో ధరల మంట మండుతోంది. భారీగా పెరిగిపోతుండడంతో సామాన్యులు, మ ధ్యతరగతి, దినసరి కూలీల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. వంటనూనె ధర చూస్తేనే సలసల కాగుతోంది. చక్కెర చేదుక్కుతోంది.. అల్లం, వెల్లుల్లి ధర రెట్టింపై అందకుండా పోతోంది. ధరలు చుక్కలనంటుతుండడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోతోంది. దీంతో దుకాణాల్లో గిరాకీ తగ్గిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పక్షం రోజుల క్రితం చక్కెర ధర కిలోకు రూ.45 ఉండగా.. రూ.25 పెరిగింది. మొన్నటి వరకు ఉల్లిగడ్డ ధర రూ.30 ఉండగా ఒక్కసారిగా రూ.20 పెరగడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అల్లం, ఎల్లిపాయలు పెరుగుతూ పోతున్నాయి. ఇటు నిత్యావసర సరుకులు.. అటు బియ్యం ధరలు పెరుగుతుండడం రెక్కాడితే గానీ డొక్కాడని శ్రమజీవులకు పెనుభారం అవుతోంది. జైశ్రీరామ్ బియ్యం ధర నెల రోజుల క్రితం క్వింటాల్‌కు రూ.5,800 ఉండగా.. ప్రస్తుతం రూ.6,800కు చేరింది. హెచ్‌ఎంటీ ధర క్వింటాల్‌కు రూ.4,800 నుంచి రూ.5,600కు, బీపీటీ ధర రూ.4,400 నుంచి రూ.5,200కు చేరాయి. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, జన్నారం, దండేపల్లి, భీమారం, శ్రీరాంపూర్, మందమర్రి, తాండూర్ పట్టణాలతోపాటు మండ ల కేంద్రాలు, గ్రామాల్లో రోజు రూ.కోట్లలో వ్యాపా రం సాగుతుంది. ప్రతీ గ్రామంలో కిరాణ దుకాణా లు, జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో సూపర్‌బజార్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు రవాణా చార్జీల కారణంగా దూరాన్ని బట్టి ధరలు మరింతగా పెరుగుతున్నాయి. నిత్యం ఆయా సరుకులు లేనిదే పూట గడవని పరిస్థితి కావడంతో ధరలు పెరిగినా కొనుగోలు చేయక తప్పడం లేదు. పేదలు ధరల పెరుగుదల తట్టుకోలేక స్వల్ప మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు ఏది కొనాలన్నా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నెలకు సరిపడా సరుకులు కొనుగోలు చేసే ప్రజలు 20 రోజులకు పరిమితం అవుతున్నారు. దీంతో వ్యాపారం తగ్గుతోందని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధరలను నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సరుకుల కిలో ధరలు
రకం పాత ధర ప్రస్తుత ధర
వంటనూనె 160 180
చక్కెర 45 70
ఉల్లిగడ్డలు 30 50
జైశ్రీరామ్ బియ్యం 63 75
హెచ్‌ఎంటీ బియ్యం 50 60
బీపీటీ బియ్యం 44 54
అల్లం 120 240
ఎల్లిపాయలు 120 240


