మంచిర్యాలఅగ్రికల్చర్: ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 90శాతం వరకు పూర్తయిందని తెలిపారు. డిజిటలైజేషన్ తర్వాత సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని, అందులో పేర్కొన్న ధ్రువపత్రాలను సమర్పించడం ద్వారా ఓటు హక్కు పొందవచ్చని తెలిపారు. డిజిటలైజేషన్ తర్వాత పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేస్తామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.


