ఆర్టీసీకి ‘స్టాఫ్‌’ బ్రేకులు..! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి ‘స్టాఫ్‌’ బ్రేకులు..!

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

● ఖాళీల బాటలో ప్రగతిచక్ర ప్రయాణం ● సిబ్బంది కొరతతో ఇబ్బందులు ● తప్పని ట్ర(డ)బుల్‌ డ్యూటీలు ● పల్లె ప్రాంతాలకు బస్సులు రద్దు

మంచిర్యాలఅర్బన్‌: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో సిబ్బంది కొరత రోజు రోజుకు తీవ్రతరం అవుతోంది. గత కొన్నేళ్లుగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు చేపట్టకపోవడంతో విధుల్లో ఉన్న సిబ్బందిపై పని భారం పెరుగుతోంది. కొత్త నియామకాలు లేక స ర్వీస్‌ అడ్జస్ట్‌మెంట్లు(ఓడీ) ద్వారా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. నిత్యం సిబ్బంది డబుల్‌ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. ఉద్యోగులకు అత్యవసర వేళల్లో కూడా సెలవులు దొరకడం గగనంగా మారింది. వరుస డ్యూటీలు, నిద్రలేమి, పని ఒత్తిడి వల్ల ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది కొరతతో కొన్నిసార్లు పల్లె ప్రాంతాలకు బస్సులు రద్దు చేయాల్సి వస్తుండడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

నియామకాలెప్పుడో..?

మంచిర్యాల డిపోలో 148 బస్సులు ఉండగా.. అద్దె బస్సులు 69 ఉన్నాయి. బస్సులను రోజుకు 60వేల కిలోమీటర్లు తిప్పడం ద్వారా 62వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు 185మంది డ్రైవర్లు, 215మంది కండక్టర్లు విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం 208 మంది కండక్టర్లకు గాను 194 మంది ఉన్నారని, 14 మాత్రమే ఖాళీలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రెగ్యులర్‌ డ్రైవర్లు 151 మంది, 38మంది అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే 21మంది కండక్టర్లు, 47మంది డ్రైవర్లు కొరత ఉన్నట్లు తెలుస్తోంది. అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిన డ్రైవర్ల నియామకాలు చేపట్టినా కండక్టర్ల ఊసే లేకుండా పోయింది. 79 ఆర్టీసీ బస్సులకు 138 మంది ఉండగా.. అద్దె బస్సులతో కలిపి 148 ఉంటే 194మంది కండక్టర్లు ఏ విధంగా సరిపోతారో అధికారులకే తెలియాలి.

పదోన్నతుల లేమి.. పెరుగుతున్న ఖాళీలు

గత కొన్నేళ్లుగా పదోన్నతులు లేకపోవడం వల్ల ఖాళీలు పెరుగుతున్నాయి. ఉద్యోగ విరమణ పొందుతున్న ఏడీసీ పోస్టుల ఖాళీలు భర్తీ చేయడం లేదు. నెల రోజుల్లో దాదాపు మరో నలుగురు ఏడీసీలు ఉద్యోగ విరమణ పొందనుండగా ఖాళీలు ఏర్పడనున్నాయి. డిపోలో విధులు నిర్వర్తించే కండక్టర్లతో సర్దుబాటు చేస్తున్నారు. కండక్టర్లను ఓడీ కింద ఉపయోగిస్తుండడంతో సేవలకు ఆటంకం కలుగుతోంది.

పల్లెలకు రాకపోకలు ఆటంకం

జిల్లాలో 18 మండలాల్లో 53 రూట్లలో బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. 148 బస్సుల్లో 69 అద్దె బస్సులు ప్రధాన రూట్లలోనే నడుస్తుంటాయి. కొన్నిసార్లు సిబ్బంది కొరతతో నిలిపి వేయాల్సి వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలకు రద్దు చేస్తున్నారు. ఉద్యోగుల సెలవు, అనారోగ్యం, ఓడీలు ఇతర కారణాలతో సిబ్బంది లేకపోవడం వల్ల పల్లె ప్రాంతాల బస్సులు రద్దవుతుంటాయి. ఆదాయం తక్కువగా ఉన్న రూట్లలోనూ తరచూ రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రామీణ ప్రజల రవాణాకు అసౌకర్యం కలుగుతోంది.

ఓటీతో ఇబ్బందులు..

మోటారు వాహనాల చట్టం ప్రకారం బస్సు నడిపే ప్రతీ ఆర్టీసీ డ్రైవర్‌కు గంట తర్వాత 15 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. ఎన్ని గంటలు నడిపితే అన్ని 15నిమిషాల లెక్కన గమ్యం చేరాక విశ్రాంతి ఉండాలని చట్టం చెబుతోంది. కానీ కనీస సమయం విశ్రాంతి ఇవ్వడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఒక రోజు విధులు నిర్వర్తిస్తే మరుసటి రోజు సెలవు ఇవాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అద్దె బస్సు డ్రైవర్లకు రోజు విడిచి రోజు డ్యూటీలకు రావాలని సూచిస్తున్న ఆర్టీసీ అధికారులు సంస్థలోని వారికి మాత్రం ఓటీ డ్యూటీ చేయాలని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. డ్రైవర్‌ సీట్లు కూడా అనువుగా లేకపోవడంతోనూ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఖాళీల భర్తీ, పదోన్నతులు కల్పించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement