వర్షాకాలం నేపథ్యంలో బియ్యం పంపిణీ
జిల్లాలో 14.500 మెట్రిక్ టన్నులు సరఫరా
మంచిర్యాలఅగ్రికల్చర్: వర్షాకాలం నేపథ్యంలో రేషన్‌కార్డుదారులకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఆగస్టు ఒకటి నుంచి నెల రోజులపాటు లబ్ధిదారులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పౌరసరఫరాల శాఖ ఇప్పటికే ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేపట్టింది. ఆగస్టు నెల కోటాతోపాటు సెప్టెంబర్, అక్టోబర్ నెలల బియ్యాన్ని పంపిణీ చేస్తారు.
ఒక్కొక్కరికి 18కిలోలు
జిల్లాలో 423 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆహా రభద్రత కార్డులు 2,57,357 ఉండగా 7,60,912 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అందజేస్తున్నారు. 4,806 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తుంటారు. ఈ లెక్కన మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనుండగా.. 14,500 మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు అందే అవకాశం ఉంది. రేషన్ దుకాణాల్లో నిల్వ సమస్యగా మారనుంది. గత ఏడాది మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిల్వ లు ఉన్నాయి. వాటితోనే ఇబ్బందులు పడుతుండగా.. గత ఎండాకాలం నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఒకేసారి పంపిణీ చేశారు. డీలర్లకు రవాణా ఖర్చులు, హమా లీ భారం తగ్గడం వంటి ప్రతికూలతలు ఉన్నా నిల్వలు భద్రపర్చడం సమస్యగా మారుతోంది. పంపిణీ చేసినకొద్దీ బియ్యం తెచ్చుకోవాలంటే హమాలీ చార్జీలు, ఇతర అదనపు ఖర్చులు భరించలేమని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పనున్న తిప్పలు..
వానాకాలం నేపథ్యంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ దుకాణాలకు బియ్యం తీసుకెళ్తుండగా గతంలో వాహనాలు బురదలో కూరుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. పలు గ్రామాలు, తండాల నుంచి రేషన్ దుకాణాలకు రెండు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకేసారి పంపిణీ చేస్తే ఆటోలు, ఎడ్లబండ్లలో తీసుకెళ్లనుండగా తిప్పలు తప్పనున్నాయి. అయితే.. బయోమెట్రిక్ విధానంలో మూడు నెలల కోటా ఒకేసారి తీసుకోవాలంటే లబ్ధి దారులు ఈ–పాస్ యంత్రంపై మూడు సార్లు వేలిముద్రలు వేయాలి. ఒక్కో కార్డు పూర్తి కావడానికి పది నిమిషాల సమయం పడుతుంది. బియ్యం పంపిణీకి ఆగస్టు నెలాఖరు వరకు సమయం ఉంది. గత నాలుగు రోజులుగా ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి బియ్యం రేషన్ దుకాణాలకు చేరవేస్తున్నారు. 14,500 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను ఇప్పటివరకు 470 మెట్రిక్ టన్నుల బియ్యం చేరవేశారు. మరో వారం రోజుల్లో మూడు నెల కోటా పూర్తి స్థాయిలో చేరుతుందని అధికారులు తెలిపారు.
దుకాణాలు
బంద్ ఉన్నాయి
ఈ–కేవైసీ చేసుకునేందుకు ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుంది అంటున్నారు. రేషన్ దుకాణాలకు వెళ్తున్నా గత ఐదు రోజులుగా బంద్ ఉంటున్నాయి. ఎక్కడ చేసుకోవడమో అర్థమైతలేదు. రేషన్ దుకాణాలు ఓపెన్ చేయాలి.
– రజిత, మంచిర్యాల
నెలాఖరులోగా చేసుకోవాలి
ఈ–కేవైసీ చేసుకోని రేషన్ లబ్ధిదారులు నెలాఖరులోగా పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచడం జరిగింది. రేషన్‌బియ్యం పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ అవకాశాన్ని రేషన్‌కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలి.
– బ్రహ్మరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
ఈ కేవైసీ 79.47 శాతం పూర్తి
జిల్లాలో గతంలో ఉన్న కార్డులతోపాటు కొత్తగా అందజేసిన కార్డులతో కలిపి 2,57,357 ఉన్నాయి. 7,60,912 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటివరకు 79.49శాతం ఈ–కేవైసీ పూర్తయింది. వంద శాతం పూర్తి కాకపోవడంతో నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ప్రస్తుతం దుకాణాలు బంద్ ఉండడంతో ఈ కేవైసీ చేసుకునేందుకు అవకాశం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
త్వరలో స్మార్ట్‌కార్డులు
రాష్ట్రంలో 2005 తర్వాత నూతన రేషన్‌కార్డులు ముద్రించి ఇవ్వకపోవడంతో ఇప్పటివరకు ఆన్‌లైన్ కార్డులను వినియోగిస్తున్నారు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాల అడ్డుకట్టకు రేషన్‌కార్డుల స్థానంలో ప్రభుత్వం త్వరలో స్మార్ట్‌కార్డులు పంపిణీ చేయనుంది. 2,56,178 స్మార్ట్‌కార్డులు జిల్లాకు పంపిణీ చేశారు. వచ్చే నెలలో అధికారికంగా స్మార్ట్‌కార్డుల పంపిణీ లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బహుళ ప్రయోజనాలు, పూర్తి భద్రత, క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డులు అందజేస్తారు. కార్డు ముందు భాగంలో కుటుంబ యజమాని ఫొటో, రేషన్‌కార్డు నంబర్, దుకాణం నంబర్ ముద్రిస్తారు. వెనుక వైపు కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరిచారు. ఆహార భద్రత కార్డు లబ్ధిదారులందరికీ పీవీసీ స్మార్ట్‌కార్డులు అందజేయనున్నారు. ఈ కార్డుతో రాష్ట్రంలోని ఏ రేషన్ దుకాణంలోనైనా సరకులు తీసుకునేందుకు సులువుగా మారనుంది.


