బెల్లంపల్లి: సులభ్, చర్మకారి, కాంట్రాక్ట్ కార్మికుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్‌ను ముట్టడించనున్నట్లు ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు టి.శ్రీనివాస్ తెలిపారు. శనివారం బెల్లంపల్లి సింగరేణి సివిక్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 200 మరుగుదొడ్లను సులభ్ ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థకు అప్పగించి రూ.కోట్లలో మెయింటెనెన్స్ చేస్తోందని తెలిపారు. ఆ మరుగుదొడ్ల నిర్వహణలో భాగస్వాములవుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో సులభ్ కార్మికులు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని కుటుంబ పోషణకు నానా తిప్పలు పడుతున్నారని పేర్కొన్నారు. వేతన బకాయిల చెల్లింపు కోసం నిర్వహించే ఆందోళనల్లో సులభ్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇప్టూ నాయకులు ఎండీ జాఫర్, భూమయ్య, రామన్న, చిన్నక్క, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.


