సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/కౌటాల: తొలకరి వానలతో ఉమ్మడి జిల్లా ప్రజలకు పిడుగుల దడ మొదలైంది. ఉరుములు, మెరుపులు, శబ్దాలతో భయం వెంటాడుతోంది. ఏటా ఉమ్మడి జిల్లాలో వానాకాలం ఆరంభం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పిడుగుల వానలు కురుస్తున్నాయి. సీజన్ ముగిసే వరకు పదుల సంఖ్యలో పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. మూగజీవాలు, ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. చనిపోతున్న వారిలో గిరిజనులు, పేద, మధ్య తరగతికి చెందిన వారే అధికంగా ఉంటున్నారు. ఒక్కోసారి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ప్రమాదం బారిన పడుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారి ధ్రువీకరణతో జిల్లా కలెక్టర్ ద్వారా బాధిత కుటుంబాలు రూ.6లక్షలు పొందవచ్చు. రైతుబీమా ఉంటే మరో రూ.5లక్షల సాయం అందుతుంది. అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోంది.
వానాకాలంలో తీవ్రత ఎక్కువ
ప్రధానంగా వానాకాలం సీజన్ ప్రారంభంలో పిడుగుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మేఘాలు రెండు ఒకదానిని మరొకటి తాకినప్పుడు విద్యుత్ శక్తి వెలువడుతుంది. ఇది భూమి వైపు ప్రయాణించే సమయంలో లోహాలు, చెట్లు, ఎత్తయిన కట్టడాలు ఆకర్షిస్తాయి. తొలకరి వర్షాల సమయంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే రైతులు, కూలీలు ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతున్నారు. ప్రాణహానితోపాటు తీవ్ర గాయాలపాలవుతున్నారు. మూగజీవాలు సైతం ఊపిరి విడుస్తున్నాయి. మరికొన్ని సమయాల్లో సెల్‌టవర్లు, విద్యుత్ ఉపకరణాలు దెబ్బతింటున్నాయి.
‘దామిని’తో తప్పును ముప్పు
ఐఎండీ(భారత వాతావరణ శాఖ) 88శాతం కచ్చితత్వంతో జిల్లాల వారీగా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికశాతం నిరక్షరాస్యులే కావడంతో గుర్తించలేకపోతున్నారు. దామిని యాప్ సమాచారాన్ని లోకల్ వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులు, కూలీలకు చేరవేయాల్సి ఉంది. యాప్ వాడే వ్యక్తికి 20నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనూ అప్రమత్తం చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘దామిని’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 7, 14, 21 నిమిషాల ముందు హెచ్చరికలు జారీ చేస్తుంది. రిజిష్టర్ చేసుకుంటే చదువురాని వారు సైతం సులువుగా అప్రమత్తం అయ్యేలా ఆలారం మోగుతుంది. తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ ముందు రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలోనూ అప్రమత్తం చేస్తుంది. ప్రజల మొబైళ్లకు సందేశాలు పంపుతుంది. జిల్లా వ్యవసాయ, ప్రణాళిక శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు, దినపత్రికల్లో వచ్చే వాతావరణ సూచనలు పాటిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.


