మంచిర్యాలక్రైం: ప్రతీ కేసులో క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టం ఈ–సాక్ష్య 2.0 అమలు చేయాలని, నిర్దేశిత గడువులోపు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్షణ పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా అన్నారు. మంగళవారం రామగుండం కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్, ఎన్‌బీడ బ్ల్యూ, మహిళలకు సంబంధించిన కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో న్యాయసలహాలు తీసుకుని దర్యాప్తు వేగవంతం చేయాలని తెలిపారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో నిందితుల అరెస్టు ఆలస్యం చేయొద్దని అన్నారు. వర్షాకాలం దృష్ట్యా పోలీసు వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, తాళ్లు, డ్రాగన్‌లైట్ అందుబాటులో ఉండాలని, ఆపదలో ఉన్న వారిని ఎలా రక్షించాలో డ్రిల్ ప్రాక్టీస్ చేయాలని సూచించారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి, అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్, సీఐలు ఎస్సైలు పాల్గొన్నారు.


