మంచిర్యాలక్రైం: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య అన్నారు. జిల్లా కోర్టు హాల్‌లో మంగళవారం జిల్లా పోలీస్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్ల వారీగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లోని కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మోటర్ వెహికిల్ యాక్ట్, క్రిమినల్ కేసులు, సివిల్ తగదాలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఒక్కసారి లోక్ అదాలత్‌లో కేసు కొట్టి వేస్తే తిరిగి అప్పీలుకు అవకాశం ఉండదని, దీంతో ఇరువర్గాలు కేసు గెలిచినట్లేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి ఏ.నిర్మల, సీనియర్ సివిల్ జడ్జి రాంమోహన్‌రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి కవిత, నిరోష, కృష్ణతేజ, డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, న్యాయవాదులు పాల్గొన్నారు.


