కాసిపేట: మందమర్రి ఏరియా కేకే ఓపెన్‌కాస్ట్ వద్ద మంగళవారం సోమగూడం, చొప్పరిపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అధిక పేలుళ్లతో ఇంట్లో ఉండలేకపోతున్నామని, ఇళ్లు పగుళ్లు తేలాయని, దుమ్ము, విషవాయువులతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పేలుళ్ల తీవ్రత అధికంగా ఉండటంతో తిప్పలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడ్డుకున్న క్రమంలో రెండు రోజులు తీవ్ర తగ్గించి తిరిగి యథావిధిగా పేలుళ్లు జరుపుతున్నట్లు ఆరోపించారు. రోజూ సాయంత్రం పేలుళ్ల దాటికి ఇళ్ల గోడలు, రేకులు పగిలి పోతున్నాయని, వర్షాకాలంలో ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేదని మండిపడ్డారు. పేలుళ్ల తీవ్రతను తగ్గిస్తామని స్పష్టమైన హామీ ఇస్తూ విస్మరిస్తున్నారని, ఇలా జరిగితే ఆందోళనలు ఉధృతం చేసి ఓపెన్‌కాస్ట్‌ను పూర్తిగా అడ్డుకోనున్నట్లు హెచ్చరించారు. ఓసీలో పేలుళ్లను తగ్గిస్తామని, గ్రామంలో సర్వే చేయించి పగుళ్లు తేలిన గోడలకు మరమ్మతులు చేయిస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని సింగరేణి అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. స్థానిక నాయకులు రాంచందర్, గురుమూర్తి, తిరుపతి, లక్ష్మణ్, స్వరూప, గ్రామస్తులు పాల్గొన్నారు.


