మృత్యువులోనూ వీడని అన్నబంధం! | - | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని అన్నబంధం!

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

గోదావరినదిలో మునిగి ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం ఒకరిని కాపాడబోయి ఒకరు మృత్యు ఒడికి.. బాసర గోదావరి నదిలో ఘటన అక్షరాభ్యాస పర్యటన విషాదాంతం

మృతదేహాలను ఒడ్డుకు చేర్చుతున్న గంగ్రపుత్రులు, పోలీసులు

మృతదేహాలను ఒడ్డుకు చేర్చుతున్న గంగపుత్రులు, పోలీసులు

బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కాచిగూడ చెప్పల్‌ బజార్‌ ప్రాంతంలో నివాసముండే నీలి నాగభూషణ్‌కు ముగ్గురు కుమారులు చంద్రశేఖర్‌ (38), రాంచందర్‌ (36), మల్లేశ్‌కుమార్‌ (31) ఉన్నారు. వీరంతా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో ఫుట్‌పాత్‌పై చిరువ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నాగభూషణ్‌ భార్య చంద్రకళ రెండేళ్ల క్రితమే మృతి చెందగా ముగ్గురు కుమారులైన చంద్రశేఖర్‌ (38), రాంచందర్‌ (36), మల్లేశ్‌కుమార్‌ (31)తో ఉంటున్నాడు. రాంచందర్‌–అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు వసంత్‌, విజయ్‌ ఉన్నారు. వీరి అక్షరాభ్యాసం కోసం ఈ కుటుంబమంతా మంగళవారం బాసరకు వచ్చింది. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయానికి వెళ్లి అక్షరాభ్యాసాలు చేయించాలని నిర్ణయించుకున్నారు. స్నానాల కోసం ఇంటెక్‌వెల్‌ వద్ద నదిలోకి దిగిన చంద్రశేఖర్‌, రాంచందర్‌, మల్లేశ్‌కుమార్‌ బురదనీటిలో కూరుకుపోయారు. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు ముగ్గురూ నీటిమునిగి మృత్యువాత పడ్డారు. తన కళ్లెదుటే ముగ్గురు కొడుకులు ప్రాణాలు కోల్పోవడం చూసి నాగభూషణ్‌ గుండెలు బాదుకున్నాడు. వీరి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

రెండు గంటలు గాలింపు

గోదావరి నదిలో స్నానాలకు దిగిన ప్రాంతంలో ఇంటెక్‌ వెల్‌ ఉంది. నది నీటిని తాగునీటి కోసం మళ్లించేందుకు ఇక్కడ ఫిల్టర్‌ బెడ్‌ నిర్మించారు. ఈ ప్రాంతంలో బురద కూడా ఎక్కువగానే ఉంది. ముందుగా స్నానానికి వెళ్లిన చంద్రశేఖర్‌ అందులో కూరుకుపోతుంటే తమ్ముడు మల్లేశ్‌కుమార్‌ కాపాడే ప్రయత్నం చేశాడు. ఇద్దరు మునిగిపోతుండగా రాంచందర్‌ వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. క్షణాల్లోనే ముగ్గురు గల్లంతైపోయారు. కళ్లెదుటే జరిగిన ఈ ఘటనను చూసి కుటుంబీకులంతా తల్లడిల్లిపోయింది. తండ్రి నాగభూషణ్‌తోపాటు మిగతా కుటుంబీకులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరి రోదన అక్కడివారిని కంటతడి పెట్టించింది. సీఐ దీపక్‌ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు స్థానిక గంగపుత్రులు వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు. భైంసా ఏరియాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వారు ముగ్గురూ తోడబుట్టిన అన్నదమ్ములు. మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం. ఒకరి చేయి పట్టుకుని ఒకరు పెరిగారు. మృత్యువు ఎదురొచ్చినా ఏ ఒక్కరూ చేయి విడువ లేదు. నీట మునిగిపోతున్న ఒకరిని కాపాడబోయి ఒకరు ఇలా ముగ్గురూ గోదావరి నదిలో మృత్యు ఒడికి చేరారు. పిల్లల అక్షరాభ్యాసం కోసం ఆనందంగా మంగళవారం నిర్మల్‌ జిల్లా బాసరకు వచ్చిన ఆ కుటుంబం పర్యటన విషాదాంతంగా ముగిసింది. ఒక్కసారిగా ముగ్గురు అన్నదమ్ముల మృతితో ఆ కుటుంబాన్ని విషాదం ముంచేసింది. – భైంసా/బాసర

బాసర యువకుల మానవత్వం

ఈ విషాద ఘటన సమయంలో మానవత్వం చూపిన బాసర యువకులు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్వచ్ఛందంగా ముందుకువచ్చి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. సొంత బంధువుల్లా బాధిత కుటుంబాన్ని ఓదారుస్తూ వారి వెంట ఉండి ధైర్యం చెప్పడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఒకవైపు ముగ్గురు కుమారులను కోల్పోయిన తండ్రి ఆవేదన, మరోవైపు భర్తను కోల్పోయిన మహిళల రోదనలు అక్కడి వారిని కన్నీళ్లు పెట్టించాయి. చిన్నారులు తమ తండ్రుల కోసం ఎదురుచూస్తుండగానే వారి మరణవార్త వినాల్సి రావడం అందరి హృదయాలను కలిచివేసింది. అంతటితో ఆగకుండా ఆ యువకులంతా విరాళాలు సేకరించి అంబులెన్స్‌, కారులో మృతదేహాలు, కుటుంబీకులను హైదరాబాద్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement