ఆదిలాబాద్‌టౌన్: మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది రిమ్స్ పరిస్థితి. ప్రతీసారి బదిలీల్లో రిమ్స్ ఆస్పత్రిపై నిర్లక్ష్యం జరుగుతోంది. అసలే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు అధిక పో స్టులు కేటాయించాల్సిన అధికారులు ఉన్న వారిని బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారిని కేటాయించకపోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో రోగుల వైద్య సేవలపై ప్రభావం చూపుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్‌లో ఇప్పుడిప్పుడే ఖాళీలు భర్తీ అవుతుండగా, ఈ బదిలీల్లో ఉన్న పోస్టులు ఖాళీ అయ్యాయి. 12మంది వైద్యులకు బదిలీలు జరగగా, నలుగురిని మాత్రమే కేటా యించారు. వీరిలో ఇద్దరు రిపోర్టు చేశారు. దీంతో పాటు 2021 బ్యాచ్‌కు చెందిన స్టాఫ్ నర్సులు దా దాపు అందరూ బదిలీ అయ్యారు. 60 మందికి స్థానచలనం జరగగా, మంగళవారం 10లోపు మా త్రమే రిపోర్టు చేశారు. బదిలీ అయిన వారి స్థానాల్లో పూర్తిస్థాయిలో చేరే అవకాశాలు కానరావడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపితే గా ని పరిస్థితి మారే అవకాశం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే రిమ్స్‌లో వైద్యు ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలుసార్లు నోటిఫికేషన్ జారీ చేసినా భర్తీకి నోచుకోవడం లేదు. ఉన్నవారిని బదిలీ చేయడంతో మరిన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి.
12మంది వైద్యులకు బదిలీలు
సాధారణ బదిలీల్లో భాగంగా రిమ్స్ ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు. రిమ్స్‌లో పనిచేస్తున్న నలుగురు ప్రొఫెసర్లు తానాజీ జాడే, కరుణాకర్, రత్నకుమారి, సరోజ బదిలీ కాగా, రిమ్స్‌కు ప్యాథాలజీకి సంబంధించి నీలవేణికు ప్రొఫెసర్ పోస్టు కేటాయించారు. అయితే, ఈమె ఇంకా విధుల్లో చేరలేదు. అ సోసియేట్ ప్రొఫెసర్లను జనరల్ మెడిసిన్ సందీప్ పవార్, గైనిక్ విభాగానికి సంబంధించి పి.క్రాంతి, పీడియాట్రిక్ వైద్యులు హేమలత, కన్నయ్య, జనరల్ సర్జన్ జి.సృజన, ఆర్థోపెడిక్ అవినాష్‌రెడ్డితో పాటు మరో అసోసియేట్ ప్రొఫెసర్‌కు ట్రాన్స్‌ఫర్ అయింది. ఈ విభాగంలో బి.గవస్కర్ మాత్రమే నిజామాబాద్ నుంచి వచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో జనరల్ మెడిసిన్‌లో కమలాకర్ బదిలీ అయ్యారు. సైకియాట్రిక్ విభాగంలో నిజా మాబాద్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్ బదిలీపై వచ్చారు. మంచిర్యాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నీలవేణి విధుల్లో చేరాల్సి ఉంది. నలుగురు ప్రొఫెసర్ల బదిలీలు జరగగా, ఒకరు వస్తున్నారు. అసోసియేట్‌లో ఐదుగురికి బదిలీ కాగా, ఒకరిని కేటాయించారు. అసిస్టెంట్ ప్రొఫెర్లలో ముగ్గురికి బదిలీ కాగా, ఇద్దరిని కేటాయించారు.
స్టాఫ్ నర్సుల పరిస్థితి కూడా..
2021 బ్యాచ్‌కు సంబంధించిన స్టాఫ్ నర్సులకు బదిలీలు జరిగాయి. రిమ్స్ నుంచి అత్యధికంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు బదిలీ చేశారు. 60 మంది వరకు బదిలీలు జరగగా, జిల్లాలో పది మంది వరకు రిపోర్టు చేశారు. స్టాఫ్ నర్సుల పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ అవుతాయా.. లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు చికిత్స చేస్తే, స్టాఫ్ నర్సులు వారికి వైద్యసేవలు అందిస్తారు. ఈ పోస్టులు ఖాళీగా ఉంటే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం గగనమే.


