ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం!

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

● ప్రమాదకర ప్రాంతాల వద్ద స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ● గోదావరి తీరంలో శాశ్వత లైఫ్‌గార్డ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ● రక్షణ బోట్లను అందుబాటులో ఉంచాలి. ● సీసీ కెమెరాలు, పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ● నదిలో స్నానానికి అనుమతించే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించాలి. ● రద్దీ సీజన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌ లేదా ప్రత్యేక రక్షణ బృందాలను మోహరింపజేయాలి.

భైంసా: బాసర గోదావరి నదిలో మరో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు పుణ్యస్నానానికి వెళ్లి నీటమునిగి మృత్యువాత పడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో బాసర గోదావరిలో భద్రతా లోపాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రతీ ఏడాది ప్రమాదాలు జరుగుతున్నా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించడం, అనంతరం పరిస్థితి మళ్లీ ఎప్పటిలాగే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

గతేడాది ఐదుగురు..

గతేడాది జూన్‌ 15న గోదావరి నదిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు నీటి మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరు రాజస్థాన్‌కు చెందినవారు కాగా, ఈ కుటుంబం హైదరాబాద్‌లో స్థిర పడింది. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన 30 మంది బృందం ఇంటర్‌సిటీ రైతులో బాసరకు చేరుకుంది. ఇసుక దిబ్బ నుంచి నీటిలో స్నానాలు చేస్తూ ప్రమాదవశాత్తు రాథోడ్‌ రాకేశ్‌, భరత్‌, మదన్‌, వినోద్‌, రుతిక్‌ మృతిచెందారు. ఈ ఘటన మరువకముందే ఇప్పుడు మరో ముగ్గురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఏటా బాసరకు లక్షలాది మంది భక్తులు వస్తున్నప్పటికీ నదీ తీరంలో శాశ్వత భద్రతా ఏర్పాట్లు మాత్రం లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు నది పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు తక్కువగా ఉండటంతో పాటు నిత్యం విధుల్లో ఉండే లైఫ్‌గార్డుల సంఖ్య కూడా సరిపడా లేదని తెలుస్తోంది. పండుగలు, సెలవు దినాలు, వారాంతాల్లో భారీగా భక్తులు వచ్చే సమయంలో ప్రత్యేక నిఘా అవసరమని భక్తులు భావిస్తున్నారు.

భక్తుల ప్రధాన డిమాండ్లు

Advertisement
 
Advertisement
Advertisement