చెన్నూర్‌లో ప్రజామరుగుదొడ్లు కరువు | - | Sakshi
Sakshi News home page

చెన్నూర్‌లో ప్రజామరుగుదొడ్లు కరువు

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

● ఇబ్బందుల్లో మూడు మండలాల జనం ● అత్యవసరమైతే బస్టాండ్‌కు వెళ్తున్న వైనం

చెన్నూర్‌: చెన్నూర్‌ బల్దియాలో ప్రజామరుగుదొడ్లుకరువయ్యాయి. కోటపల్లి, వేమనపల్లితో పాటు చెన్నూర్‌ మండలాలకు చెన్నూర్‌ మున్సిపాలిటీ వ్యాపార కేంద్రంగా మారింది. దీంతో నిత్యం వేలాదిమంది ప్రజలు వివిధ అవసరాల కోసం ఇక్కడికి వస్తుంటారు. బల్దియా పరిధిలో 18 వార్డులుండగా సుమారు 30 వేలకు పైగా జనాభా ఉంది. గతంలో చెన్నూర్‌లో ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాల్లో రెండు సులభ్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయగా అందరూ వినియోగించుకున్నారు. నూతన ఆస్పత్రి భవన నిర్మాణంలో భాగంగా సులభ్‌ కాంప్లెక్స్‌ను తొలగించడంతో అందరికీ బస్టాండ్‌లోని సులభ్‌ కాంప్లెక్స్‌ మాత్రమే దిక్కయింది. దీంతో ప్రధానంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితులుంటే ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధాన వ్యాపార సంస్థలు, బ్యాంక్‌లు, ఆస్పత్రి గాంధీచౌక్‌ ఏరియాల్లోనే ఉండడంతో ఇక్కడికి జనం ఎక్కువగా వస్తుంటారు. అధికారులు స్పందించి గాంధీచౌక్‌, పాత బస్టాండ్‌ ఏరియాల్లో ప్రజామరుగుదొడ్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

సమస్య పరిష్కరిస్తాం

మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన వ్యాపార కేంద్రాల ప్రాంతాల్లో ప్రజామరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం లేదు. ప్రజల ఇబ్బందులను గుర్తించి పాత బస్టాండ్‌ ప్రాంతం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ సమీపంలో ప్రజామరుగుదొడ్లు నిర్మించాలని ప్రతిపాదించాం. సమస్యను మంత్రి వివేక్‌ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి పాత బస్టాండ్‌ ప్రాంతంలో సులభ్‌ కాంప్లెక్‌ నిర్మించేందుకు కృషి చేస్తాం.

– మురళీకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement
 
Advertisement
Advertisement