బోథ్: బోథ్, సొనాల మండలాల వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సష్టించింది. ఏకధాటిగా దాదాపు మూడు గంటల పాటు కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సొనాల మండలంలోని పెద్దగూడ గ్రామ సరిహద్దులో ప్రవహిస్తున్న వాగు ఉధృతికి వంతెన సమీపంలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోథ్ మండల కేంద్రంలోనూ వర్షం కురిసే సమయంలో పిడుగు పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిడుగు తీవ్రతకు పట్టణంలోని పలువురి ఇళ్లలో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. మరోవైపు ఈ ఏడాది తొలకరి పలకరించడంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాన పడటంతో అదును చూసుకుని పలు గ్రామాల్లో రైతులు ఆనందంగా విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు.


