మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి అకాల వర్షం దంచికొట్టింది. 22.3మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులు, భారీ వర్షానికి దిగుబడి దశలో ఉన్న వరి పంట, కోతకు వచ్చిన మామిడి నేలరాలి తీవ్ర నష్టం వాటిల్లింది. కోటపల్లి, బెల్లంపల్లి, జైపూర్, భీమారం, చెన్నూర్, మందమర్రి, కన్నెపెల్లి మండలాల్లోని 65 గ్రామాల్లో 1,830 మంది రైతులకు చెందిన 3,191 ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక సర్వేలో గుర్తించారు. కొనుగోలు కేంద్రల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. వరద నీటిలో కొట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. గత కొద్ది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం కోసం ఎదురుచూస్తున్న రైతులను వర్షం ఆగమాగం చేసింది. ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం, మిల్లుల ట్యాగింగ్ ఇవ్వకపోవడంతో పంట వర్షార్పణమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
జిల్లాలో 22.3 మిల్లీమీటర్ల వర్షం
జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు 22.3మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మంచిర్యాల మండలంలో 45.8 మిల్లీమీటర్లు, చెన్నూర్‌లో 45.5, భీమారంలో 43.3, కాసిపేటలో 35.3, జైపూర్‌లో 35.3, మందమర్రిలో 27.5, లక్సెట్టిపేటలో 23.8, వేమనపల్లిలో 22.3, కోటపల్లిలో 17.3, నస్పూర్‌లో 8, నెన్నెలలో 8.5, దండేపల్లిలో 6.8, జైపూర్‌లో 5.3, బెల్లంపల్లిలో 4.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
కోటపల్లిలో తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతు
జిల్లాలో పంట నష్టం వివరాలు
మండలం రైతులు ఎకరాలు
కోటపల్లి 651 1066
బెల్లంపల్లి 15 30
జైపూర్ 11 21
భీమారం 55 94
చెన్నూర్ 982 1,812
మందమర్రి 76 138
కన్నెపల్లి 40 30
మొత్తం 1830 3,191
విద్యుత్ శాఖకు తీరని నష్టం
బలమైన ఈదురుగాలు, వర్షంతో విద్యుత్ శాఖకు రూ.90 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. చెట్లు విరిగి విద్యుత్ తీగలు, స్తంభాల పై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 202 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. తీగలు, 3 ట్రాన్స్‌ఫర్మార్లు ధ్వంసం కావడంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుధవారం విద్యుత్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సరఫరా పునరుద్ధరణ చేపట్టారు.


