చెన్నూర్‌రూరల్: వరి కోసేందుకు రైతులు ఎక్కువగా యంత్రాలను వినియోగిస్తున్నారు. దీంతో వరిగడ్డి ముక్కలు, ముక్కలుగా కావడంతో ఎక్కువగా పశువుల మేతకు పనికిరాకుండా పోతోంది. దీంతో వేసవిలో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు రైతులు గడ్డిజొన్నను సాగుచేస్తే పశుగ్రాసానికి కొరత ఏర్పడకుండా ఉంటుంది. జిల్లా కేంద్రంలోని వెటర్నటీ ఆసుపత్రి స్టోర్‌లో గడ్డిజొన్న ఎస్‌హెచ్‌జీ రకం విత్తనాలు 8.9 టన్నులు అందుబాటులో ఉన్నాయని, రైతులకు 75 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి యాకూబ్‌రెడ్డి తెలిపారు.
జిల్లాలో 12,09,436 మూగజీవాలు
జిల్లాలో 1,38,536 ఆవులు, 1,04,080 గేదెలు, 2,42,616 ఎద్దులు, 5,36,913 గొర్రెలు, 1,87,291 మేకలు ఉన్నాయి. మండలాల వారీగా పశువుల సంఖ్యను బట్టి గడ్డిజొన్న విత్తనాలు పంపిణీ చేయనున్నారు. రైతులు సూపర్ నేవియర్ అనే గడ్డిజాతి రకాన్ని పెంచుకుంటే ఏళ్ల తరబడి పశువులకు గ్రాసం లభిస్తుంది. డెయిరీ ఫాంలు ఉన్న రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గడ్డి రకం కట్ చేసిన కొద్దీ పెరుగుతుంది. చిన్నచిన్నగా కట్ చేసిన ముక్కలను రెండున్నర ఫీట్లకు ఒకటి చొప్పున భూమిలో నాటుకుంటే ఇవి మొలకెత్తుతాయి. అలాగే హెడ్జ్ లూసర్న్ రకం మొక్కలలో మాంసకృత్తులు అధికంగా ఉండి ఆవులు, గేదెలు పాలను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. విత్తనాలు విత్తిన 45 రోజులకు ఈ గడ్డిజొన్న కోతకు వస్తుంది. కోత కోసి పశువులకు మేతగా వేసిన తర్వాత మళ్లీ పిలకలు వచ్చి మొక్కలు ఎదుగుతాయి. ఏళ్లతరబడి పశుగ్రాసం లభిస్తుంది. బహు వార్షికాలను కూడా పెంచవచ్చు. ఇవి విత్తనాలు కాకుండా మొక్కలను లేదా కాండపు పిలకలను నాటగానే కలుపు పెరగకుండా ఉండేందుకు 30 నుంచి 60 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి నీటితడులు ఇవ్వాలి. యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పశుగ్రాసం సాగు చేసుకుంటే వేసవిలో కూడా పశువులకు గ్రాసం కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఎస్‌హెచ్‌జీ ఏక వార్షిక గడ్డిజొన్న సాగు చేస్తే ఏడాది పాటు పశువులకు గ్రాసం లభిస్తుంది.
రైతులు దృష్టి సారించాలి
వేసవిలో పశువులకు మేత సరిగా దొరకదు. కాబట్టి రైతులు పశుగ్రాసం సాగుపై దృష్టి సారించాలి. ఎస్‌హెచ్‌జీ రకం గడ్డి జొన్న విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డెయిరీఫాంలు నడిపించే రైతులు పశుగ్రాసాలను తప్పకుండా సాగు చేయాలి. అలాగే వేసవిలో పశువులు, జీవాల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి.
– యాకూబ్‌రెడ్డి, జిల్లా పశువైద్యాధికారి, మంచిర్యాల


