పూర్వ ప్రాథమిక విద్యకు నిధులు
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు (ప్రీ కేజీ తరగతులు) ప్రారంభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 55 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో నిర్మల్ జిల్లాలో 10, ఆదిలాబాద్ జిల్లాలో 6, కుమురంభీం జిల్లాలో 13, మంచిర్యాల జిల్లాలో 26 ఉన్నాయి.
వసతుల కల్పన..
పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రతీ పాఠశాలకు ఒక ఆయాను నియమించారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద నడుస్తున్న వాటిలో నవంబర్ నుంచి ఇన్‌స్ట్రక్టర్, ఆయాలను తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇన్‌స్ట్రక్టర్‌లకు నెలకు రూ.8000, ఆయాలకు నెలకు రూ.6000 వేతనం చెల్లించనున్నారు. వీరికి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మొత్తం 6 నెలలకు వేతనాలు విడుదలైనట్లు అఽధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి జిల్లా సమాచారం..
జిల్లా పూర్వ ప్రాథమిక కేటాయించిన
పాఠశాలలు నిధులు
నిర్మల్ 10 రూ.8.40 లక్షలు
ఆదిలాబాద్ 6 రూ.5.88 లక్షలు
కుమురంభీం 13 రూ.12.74 లక్షలు
మంచిర్యాల 26 రూ. 25.48 లక్షలు
మొత్తం 55 రూ.52.50 లక్షలు


