ఎస్టీపీపీలో ప్రమాదం.. ఆపరేటర్‌కు గాయాలు
జైపూర్: మండల కేంద్రంలోని 1200మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో బుధవారం ఉదయం 7గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న పవర్‌మేక్ కంపెనీకి సబ్ కాంట్రాక్టుగా వ్యవహరిస్తున్న గ్లోబస్ కంపెనీలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన కుడక శ్రీనివాస్ స్విచ్‌గేర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులకు వచ్చిన శ్రీనివాస్ ఉదయం 6:50సమయంలో యాష్‌హ్యాండ్లింగ్ ప్లాంటు(ఏహెచ్‌పీ)లో మాడ్యుల్ ఆఫ్ చేసి పని చేస్తున్న క్రమంలో దాంట్లో నుంచి ఒక్కసారిగా ఫ్లాష్ అవుట్ అయి మంటలు వచ్చాయి. దీంతో శ్రీనివాస్ ముఖం, కళ్లు, చేతులు కాలిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కార్మికులకు రక్షణ పరికరాలు అందించకుండానే వారితో పని చేయించడంతో శ్రీనివాస్ గాయపడినట్లుగా స్థానిక యూనియన్ నాయకులు వాపోయారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
గాయపడ్డ శ్రీనివాస్


