
అలనాటి ఇళ్లలో..చల్లగా.. హాయిగా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. దీంతో పేదల ఇళ్లలో ఫ్యాన్లు, మధ్య తరగత ఇళ్లలో కూలర్లు, ఎగువ మధ్య తరగతి నుంచి సంపన్నుల ఇళ్లలో ఏసీలు 24 గంటలూ నడుస్తున్నాయి. అయినా వాటికింద ఉన్నంతసేపే వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కాసేపు బయటకు వెళ్లినా వేడి తట్టుకోలేకపోతున్నారు. కానీ ఉమ్మడి జిల్లాలోని పాతకాలంనాటి ఇళ్లలో ఉంటున్నవారు మాత్రం మండువేసవిలోనూ చల్లగా.. హాయిగా ఉంటున్నారు. ఎక్కువ ఎత్తుతో కట్టిన మట్టి మిద్దెలు, ఎక్కువ గ్రీనరీతో నిర్మించుకున్న పురాతన ఇళ్లలో ఫ్యాన్ గాలి చల్లదనం సరిపోతుందని పేర్కొంటున్నారు. నాటి నిర్మాణ శైలి, నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి కారణంగా నేటికీ ఉష్ణోగ్రతలు ఎంత పెరిగినా ఆ ఇళ్లలో వేడిగా ఉండదని యజమానులు చెబుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
చల్లదనం పంచుతుంది
మాది రత్నాపూర్ కాండ్లి. మేము ఇద్దరం అన్నదమ్ములం. 1970లో రూ.50 వేలు ఖర్చుచేసి బంకమట్టి ముద్దలు, సున్నపురాయి కలిపి ఇంటిగోడలు నిర్మించాం. ఇంటి పైకప్పుపై మట్టిముద్దలు పేర్చి దానిపై గూనపెంకలు పేర్చాం. అందుకే వేసవి కాలంలో కూడా మాఇల్లు చల్లదనాన్ని పంచుతుంది. – ముత్తన్న, రత్నాపూర్ కాండ్లి, నిర్మల్
ఏసీ, కూలర్ అవసరం లేదు
మాదీ నిర్మల్ రూరల్ మండలంలోని రత్నాపూర్‌కాండ్లీ. ఎస్సారెస్పీ రియాబిటేషన్ విలేజ్ కావడంతో 1977లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూములు కోల్పోయిన వారికి విశాలమైన ఇళ్ల స్థలాలు ఇచ్చింది. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో మా మామయ్యలు ఎంతో ఆసక్తితో చుట్టూ బంతి ఇల్లు నిర్మించారు. వేసవికాలంలో ఎలాంటి ఏసీ, కూలర్ అవసరం ఉండదు. అందుకే ఇప్పటికీ అతి పురాతనమైన ఈ ఇంట్లోనే నివాసం ఉంటున్నాం. – ఉమారెడ్డి, రత్నాపూర్ కాండ్లి, నిర్మల్
డంగుసున్నంతో నిర్మించాం
దండేపల్లి: మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మాదాపూర్. 90 ఏళ్ల క్రితం డంగుసున్నంతో మిద్దె ఇల్లు (భవంతి) నిర్మించాం. సాధారణ ఇళ్లకంటే ఎక్కువ ఎత్తులో నిర్మించాం. ఇప్పటికీ మాఇంట్లో ఫ్యాన్లు తప్పా కూలర్లు, ఏసీలు వాడం. మండు వేసవిలోనూ ఎంతో చల్లగా ఉంటుంది. 90 ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.
– వీరమనేని సుభద్ర, మాదాపూర్, దండేపల్లి, మంచిర్యాల
చల్లగానే ఉంటుంది
మా నాన్నలు ఇద్దరు అన్నదమ్ములు. మేము నలుగురం అన్నదమ్ములం. 1970లో కలిసికట్టుగా బంతి ఇల్లు నిర్మించుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మా అన్నదమ్ములం ఇదే ఇంట్లో కలిసే ఉంటున్నాం. ఇంటి పైకప్పుకు వేపచెక్కలు కొట్టి వాటిపై మట్టిముద్దలు వేసి పైన గూనపెంకలు పేర్చారు. అందుకే వేసవికాలంలో ఎండలు ఎంతగా ముదిరినా మా ఇంట్లో మాత్రం చల్లగానే ఉంటుంది.
– లింగన్న, రత్నాపూర్ కాండ్లి, నిర్మల్

అలనాటి ఇళ్లలో..చల్లగా.. హాయిగా..

అలనాటి ఇళ్లలో..చల్లగా.. హాయిగా..

అలనాటి ఇళ్లలో..చల్లగా.. హాయిగా..

అలనాటి ఇళ్లలో..చల్లగా.. హాయిగా..