
భూభారతితో సమస్యలు పరిష్కారం
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లిరూరల్: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి చట్టం రూపొందించారని, ఈ చట్టంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని కన్నాల రైతువేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులకు భూమిపై పూర్తి స్థాయిలో హక్కులు లభిస్తాయని అన్నారు. ఎలాంటి సమస్యనైనా క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడానికి వీలుందని తెలిపారు. అనంతరం రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్, అదనపు కలెక్టర్‌లను శాలువాలతో సన్మానించారు. అనంతరం బుధాకుర్థు గ్రామ పంచాయతీ పరిధిలో సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో పి.హరికృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ కారుకూరి రాంచందర్, పీ ఏసీఎస్ చైర్మన్ స్వామి, ఏడీఏ రాజానరేందర్, తహసీల్దార్ జ్యోత్న్స, నాయకులు మహేందర్, శ్రీనివా స్, స్వామి, అనిత, లక్ష్మీనారాయణ, మల్లయ్య పాల్గొన్నారు.
రైతులకు వరం..
తాండూర్: భూభారతి చట్టం రైతులకు వరమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సురభి గార్డెన్స్‌లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టానికి రూపకల్పన చేసిందన్నారు. ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసి భవిష్యత్‌లో ఎలాంటి భూ సమస్యలు రాకుండా మరింత సమర్థవంతంగా చట్టాన్ని అమలు చేస్తామన్నారు. రైతులు, నాయకులు చేసిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ భూభారతి చట్టం, ప్రయోజనాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, డెప్యూటీ తహసీల్దార్ వీవీఆర్‌కేడీ ప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సౌమ్య, కాంగ్రెస్ నాయకులు, న్యాయవాదులు హాజరయ్యారు.