టెంటు సాక్షిగా ప్రమాణ స్వీకారం
● భవనాలు లేక టెంట్ల కిందనే కార్యక్రమం
● కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాలు ● కన్నెపల్లి మండలం గొల్లగట్టు పంచాయతీ కార్యాలయం అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ముత్తపూర్, టేకులపల్లి, వీరాపూర్, మెట్టుపల్లి కార్యాలయాలు స్థానిక ప్రాథమిక పాఠశాలల ఖాళీ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో టెంట్ల కింద ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. నాయకునిపేట పంచాయతీ భవనం స్లాబ్ స్థాయిలో ఉండడంతో చుట్టూ పరదాలు కట్టి ముందు టెంటు వేశారు.
● దండేపల్లి మండల కేంద్రంలోని పంచాయతీ భవన నిర్మాణం పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో సమీపంలోని జీసీసీ భవనంలో నిర్వహిస్తున్నారు. ఇరుకు గదుల కారణంగా సోమవారం టెంటు వేసి పాలకవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. లింగాపూర్‌లో భవనం నిర్మాణంలో ఉండడంతో రైతువేదికలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. తానిమడుగులో ఎస్టీ కమ్యూనిటీ హాల్‌లో, కర్ణపేటలో వీఎస్‌ఎస్ భవనంలో నిర్వహించారు.
● దండేపల్లి మండలం మామిడిపల్లిలో పది మంది వార్డు సభ్యులకు గాను మొదట ఏడుగురితో ప్రత్యేకాధికారి రోహిత్‌దేశ్‌పాండే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత మరో ముగ్గురు రాగా.. మళ్లీ అందరూ కలిసి ప్రమాణం చేశారు. తాళ్లపేటలో 10 మంది వార్డు సభ్యులకు, సర్పంచ్, ఏడుగురు వార్డు సభ్యులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు.
● చెన్నూర్ మండలం లింగంపల్లిలో పంచాయతీ కార్యాలయ భవనం పాతది కావడం, లోపల స్థలం లేక ఆరుబయట టెంటు వేయించి సర్పంచ్ అంగ రమేష్, ఉప సర్పంచ్ జీల్ల తిరుపతి, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీవో అజ్మత్ అలీ పాల్గొన్నారు.
● భీమారం మండలం కాజిపల్లి, ధర్మారం, కొత్తపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో కార్యాలయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. కాజిపల్లిలో పాఠశాల ఆవరణలో ఒక భవనాన్ని కేటాయించారు. దీంతో తరగతుల నిర్వహణకు ఇబ్బందిగా మారనుంది.
భీమిని/దండేపల్లి/చెన్నూర్‌రూరల్/భీమారం: జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో భవనాలు లేక.. మరికొన్ని శిథిలావస్థ కారణంగా పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం టెంట్ల ఏర్పాటు చేశారు. సర్పంచ్‌లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు టెంట్ల కింద ప్రమాణ స్వీకారం చేశారు.
చెప్పులు ధరించని సర్పంచ్
భీమిని: మండలంలోని బిట్టురుపల్లి సర్పంచ్ రాంటెంకి దశరథ్ గత 15ఏళ్లుగా చెప్పులు ధరించడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో డిసెంబర్ 9, 2009న విద్యార్థులు, యువకులు ఎలాంటి ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, ఎవరికీ ఎలాంటి హాని కలుగవద్దని ఇష్ట దైవానికి మొక్కి నిర్ణయం తీసుకున్నాడు. సర్పంచ్‌గా ఎన్నికై నా సోమవారం పాదరక్షలు ధరించకుండానే ప్రమాణ స్వీకారం చేశాడు.