● ప్రైవేటు ఆసుపత్రుల్లో చిన్నారుల మృతి ● ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు | - | Sakshi
Sakshi News home page

● ప్రైవేటు ఆసుపత్రుల్లో చిన్నారుల మృతి ● ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు

Dec 23 2025 6:51 AM | Updated on Dec 23 2025 6:51 AM

● ప్రైవేటు ఆసుపత్రుల్లో చిన్నారుల మృతి ● ఆందోళన కలిగిస్

● ప్రైవేటు ఆసుపత్రుల్లో చిన్నారుల మృతి ● ఆందోళన కలిగిస్

● ప్రైవేటు ఆసుపత్రుల్లో చిన్నారుల మృతి ● ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు ● జగిత్యాలకు చెందిన పల్లపు శేఖర్‌, సౌందర్య దంపతులు తమ కుమారుడు కార్తీక్‌(4)ను గత నవంబర్‌ 18న దమ్ము శ్వాసకోశ సమస్యతో జిల్లా కేంద్రంలోని ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో చేర్చారు. 19న రాత్రి పరిస్థితి విషమించిందని వెంటిలేషన్‌పై ఉంచి వేరే చోటికి తీసుకెళ్లాలని సూచించారు. ఏమైందని కుటుంబ సభ్యులు నిలదీయడంతో అప్పటికే బాబు మృతిచెందాడని తెలిపారు. ● గత నవంబర్‌ 21న పిల్లల ఆసుపత్రిలో ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానెపల్లి మండలం రుద్రాపూర్‌ గ్రామానికి చెందిన కపాల వెంకటేష్‌, శ్రీవాణి దంపతుల కూతురు సాహితి(6) మృతిచెందింది. జ్వరంతో అదే నెల 15న ఆసుపత్రికి తీసుకొచ్చారు. డెంగీ జ్వరమంటూ 20వరకు వైద్యం అందించారు. అదే రోజు రాత్రి మృతిచెందిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ● ఈ నెల 16న స్థానిక ప్రైవేటు నర్సింగ్‌హోంలో గర్భస్థ శిశువు మృతిచెందిన ఘటన సంచలనం సృష్టించింది. ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన కుమ్మరి పద్మ సంతానం కోసం ఆ నర్సింగ్‌హోంలో వైద్యం పొందింది. గర్భం దాల్చగా ఈ నెల 16న మధ్యాహ్నం ప్రసవం నిమిత్తం ఆసుపత్రికి వచ్చింది. ప్రసవం చేయకుండా ఆలస్యం చేసినందుకు గర్భంలోనే శిశువు మృతిచెందింది అంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆసుపత్రి వైద్యురాలిపై కేసు నమోదైంది.

మంచిర్యాలక్రైం: జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం వ్యాపారంగా మారింది. చిన్నారుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో 15రోజుల క్రితం ఇద్దరు చిన్నారులు మృతిచెందగా.. ఈ నెల 16న ఓ నర్సింగ్‌హోంలో గర్భస్థ శిశువు చనిపోయాడు. పదిహేను రోజుల్లోనే జరిగిన ఈ ఘటనలకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబాలు ఆందోళన చేశాయి. మంచిర్యాల మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు సరిహద్దు కావడంతో వైద్యం కోసం వస్తుంటారు. పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్‌, కరీంనగర్‌కు వెళ్తుంటారు. అంతదూరం వెళ్లలేని పేదలు ఇక్కడి వైద్యులను ప్రాధేయపడి చికిత్స పొందుతుంటారు. ఇదే అదునుగా భావించిన కొందరు వైద్యులు హైదరాబాద్‌ తరహా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల వైద్యం అంటూ బోర్డులు ఏర్పాటు చేసి మభ్య పెడుతున్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఉండాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు గానీ ఏవీ ఉండవు. ఇక చిన్నపిల్లల ఆస్పత్రుల వైద్యులైతే మరీ దారుణం. ఆస్పత్రికి వెళ్తే అడిగినంత డబ్బులు కట్టాల్సిందే. డబ్బులు కట్టినా ప్రాణాలకు భరోసా ఉండదు. పరిస్థితి విషమించాక వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ చేతులెత్తేసిన, ప్రాణాలు పోయిన ఘటనలు కోకొల్లలు. బాధిత కుటుంబాల ఆందోళనలూ అనేకంగా ఉన్నాయి.

ఆందోళనలు..

వైద్యుల నిర్లక్ష్యమో.. పరిస్థితి విషమమో తెలియదు గానీ మధ్య తరగతి ప్రజల ప్రాణాలతో కొందరు వైద్యులు చెలగాటం ఆడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చిన్నారుల మృత్యువాత ఘటనలు వైద్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతిచెందారంటూ బాధితులు ఆందోళనలు చేపడుతున్నారు. వీరికి కొన్ని సంఘాల నాయకులు తోడై ఆందోళనలు చేయడం, న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ అటు వైద్యులతో చర్చలు జరిపి సెటిల్‌మెంట్లు చేసి ఖరీదు కట్టడం పరిపాటిగా మారింది. బాధితుల ఆందోళనకు ఆసుపత్రి యాజమాన్యాలు ఎంతో కొంత ముట్టజెప్పి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.

15 రోజుల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు మృతి

నిర్లక్ష్యం.. ఖరీదైన ప్రాణాలు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement