పంచాయతీల అభివృద్ధికి బాసట | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల అభివృద్ధికి బాసట

Nov 20 2026 1:13 AM | Updated on Nov 20 2026 1:13 AM

సంతోషంగా ఉంది..

గ్రామాల్లో ఏ పనులు చేసినా బిల్లు కోసం గతంలో నెలల తరబడి ట్రెజరీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దీంతో గ్రామాల సర్పంచులం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లం. అప్పులు చేస్తే వడ్డీలు కట్టాల్సి వచ్చేది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక ఖాతాల నిర్ణయంతో నిధులు తీసుకునే వెసులుబాటు సులభం కావడంతో.. గ్రామ పంచాయతీల తీర్మానంతో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లభించింది.

– వెంకట్రాములుగౌడ్‌, జిల్లా అధ్యక్షుడు, సర్పంచ్‌ల సంఘం

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): గతంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం సర్పంచులు ట్రెజరీకి పంపి.. నిధులు రావడానికి నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను అధిగమించి సర్పంచుల కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తెచ్చింది. జిల్లాలోని 17 మండలాల పరిధిలో 423 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధుల కోసం కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవాలని ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభలో చట్ట సవరణ ద్వారా ఇకపై జీపీలకు ఈ ఖాతాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర, రాష్ట్ర నిధులతోపాటు స్థానికంగా వచ్చే పన్నులు కూడా ఈ ఖాతాల్లో జమ చేసుకునే అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని సర్పంచ్‌ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిధులు జమ చేసుకునే విధానం..

జాతీయ, సహకార బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో గ్రామ పంచాయతీల పేరిట ప్రత్యేకంగా ఖాతాలు తెరవవచ్చు. 16వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాష్ట్ర ఫైనాన్స్‌ తదితర నిధులతోపాటు స్థానికంగా వసూలయ్యే ఇంటి పన్నులు, అద్దెలు కూడా ఇందులో జమ చేసుకోవచ్చు. అత్యవసర పనుల కోసం ఈ నిధులను వెంటనే డ్రా చేసుకునే వెసులుబాటు కలిగిందని సర్పంచులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బోర్లు, బావుల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం, పారిశుద్ధ్య పనులు నిర్వహించడం, వీధిదీపాల సమస్యలు పరిష్కరించేందుకు ఈ నిధులు వినియోగించుకోవచ్చని సర్పంచులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు..

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామ పంచాయతీలకు నూతన ఖాతాలు తెరిపించాం. గ్రామాల్లో చేపట్టే పనుల కోసం జీపీ తీర్మానాలు చేసి.. పనులు పూర్తి అయిన అనంతరం ఎంబీ రికార్డు చేసి బిల్లులు సమర్పించి ఈ ఖాతాల నుంచి నేరుగా నిధులు డ్రా చేసుకోవచ్చు. ఈ నూతన విధానంతో సులువుగా.. వేగంగా నిధులు డ్రా చేసుకోవడంతోపాటు సమస్యలను కూడా త్వరగా పరిష్కరించుకునే అవకాశం లభిస్తుంది. – వెంకట్‌రెడ్డి, డీపీఓ

తీరనున్న సర్పంచుల ఆర్థిక కష్టాలు

జీపీలకు ప్రత్యేకంగా నూతన బ్యాంకు ఖాతాలు

చట్ట సవరణతో తాజా వెసులుబాటుపై సర్పంచ్‌ల హర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement