● దొంగ బంగారం కొనుగోలు
చేసిన వ్యాపారి
● విచారణలో 78 గ్రాముల
పసిడిగా గుర్తింపు
● వ్యాపారి నుంచి రూ.6లక్షల విలువైన బంగారం రికవరీ
● నిందితుడు జిల్లావాసిగా
గుర్తించిన పోలీసులు
గద్వాల క్రైం: అపహరించిన బంగారు ఆభరణాలను నిందితుడు గద్వాల జిల్లాకు చెందిన ఓ వ్యాపారికి విక్రయించినట్లు కర్ణాటక పోలీసులు గుర్తించి మంగళవారం నిందితుడి సహాయంతో స్వర్ణకారుల కాంపెక్ల్‌స్‌లోని ఓ వ్యాపారిని అదుపులోకి తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక వ్యాపారులు, కర్ణాటక పోలీసు కథనం మేరకు.. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలానికి చెందిన ఓ యువకుడు ఉద్యోగం కోసం హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వెర్ కంపెనీలో చేరాడు. రెండు నెలల క్రితం కర్ణాటకలోని ఎరిగేర ప్రాంతాల్లోని రద్దీ కూడలీలో వ్యక్తిగత పనులపై బయటకు వచ్చిన మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆమె మెడలోంచి వీలువైన బంగారు ఆభరణాలను అపహరించాడు. ఈ మేరకు అక్కడి పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే నిందితుడి కర్ణాటక పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అపహరించిన బంగారు ఆభరణాలను గద్వాల పట్టణంలోని స్వర్ణకారుల కంప్లెక్స్‌లోని వ్యాపారికి విక్రయించినట్లు పేర్కొన్నాడు. సదరు వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆరా తీయగా.. కొనుగోలు చేసినట్లు వివరించాడు. ఈ మేరకు స్థానిక పోలీసుల సహాయంతో వ్యాపారి నుంచి రూ.6లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. నిందితుడు కంపెనీ కారులో తిరుగుతూ నేరాలకు పాల్పడినట్లు కర్ణాకట పోలీసులు చెబుతున్నారు. దొంగ బంగారం కొనుగోలు చేసిన ఘటన వెలుగుల్లోకి రావడంతో జిల్లాకేంద్రంలో మరోసారి కలకలంగా మారింది. తరచూ ఇలాంటి ఘటనలు జిల్లాలో చోటు చేసుకోవడం కొసమెరుపు. నేరస్తుల నుంచి తక్కువ ధరలకే బంగారు కొనుగోలు చేయడం చివరకు పోలీసులు రికవరీ చేయడం షరా మాములుగా మారింది. నిందితుల నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం వ్యాపారులకు కలిసి వస్తుంది. ఈ విషయంపై స్థానిక పోలీసులను సంప్రదించగా.. కర్ణాటక పోలీసులు వచ్చిన విషయం మా దృష్టికి రాలేదని పేర్కొన్నారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన వ్యాపారిని సాక్షి సంప్రదించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.


