సమస్యల వలయంలో ఆశ్రమ పాఠశాల | - | Sakshi
Sakshi News home page

సమస్యల వలయంలో ఆశ్రమ పాఠశాల

Nov 18 2026 12:50 AM | Updated on Nov 18 2026 12:50 AM

మన్ననూర్‌: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక సమస్యలతో సతమతమవుతున్నారని బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శివనాయక్‌ ఆరోపించారు. అమ్రాబాద్‌ మండలంలోని వటువర్లపల్లిలో కొనసాగుతున్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను విద్యార్థి నాయకులతో కలిసి మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశీలించి పాఠశాల, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు, స్థితిగతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో కనీస వసతులు లేకపోగా పరిసరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల, వసతి గృహంలో మరుగుదొడ్లు లేక మలమూత్ర విసర్జనకు సమీపంలోని నల్లమల అభయారణ్యంలోకి వెళ్తున్నారని తెలిపారు. ఫ్యాన్లు లేవు, విద్యార్థులకు ఉదయం అల్పాహారంగా పసుపు అన్నం, మధ్యాహ్నం, రాత్రికి మొత్తంగా అన్నం, కుళ్లిన కూరగాయలతో వండిన కూరలు, కుళ్లిన అరటి పండ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. కొంతకాలంగా విద్యార్థులకు పెరుగు, గుడ్డు, స్నాక్స్‌ ఇవ్వడం లేదన్నారు. గణితం, సైన్స్‌ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విధ్య అందడంలేదు. తరగతి గదుల్లోనే ఉపాధ్యాయులు తాగి పడేసిన సిగరెట్లు, అగ్గిపుల్లలు పడి ఉండటం, పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉందన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు పర్యవేక్షించి పాఠశాల నిర్వాహకులపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రవి యాదవ్‌, శివనాయక్‌, స్వామి యాదవ్‌, గ్రామ యువకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement