అడ్డాకుల: ప్రతి విద్యార్థి బాలల హక్కులు, చట్టపరమైన రక్షణపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర సూచించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మూసాపేట మండలం సంకలమద్ది శివారులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. లైంగిక వేధింపులు, ఇతర అన్యాయాలను ఎదుర్కొనేందుకు చట్టాలపై అవగాహన అవసరమన్నారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే భయపడకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి ఉన్నత విద్య సాధన దిశగా ముందుకు సాగాలని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయ అవగాహనపై నిర్వహించిన నాటికలు, ప్రసంగాలు, వ్యాసరచన పోటీల విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పేదరిక నిర్మూలన పథకం, ఉచిత న్యాయ సహాయం, బాలల స్నేహపూర్వక న్యాయ సేవలు, మానసిక, మేధో వైకల్యం, వరకట్న నిషేధ చట్టం తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ నాగయ్య, కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీకాంత్, కేజీబీవీ ప్రత్యేకాధికారిణి పావణిసింగ్ తదితరులు పాల్గొన్నారు.


