మదనాపురం: ఏడు కొండలపై కొలువుదీరిన కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రం.. భక్తి, చరిత్ర, రాజపోషణకు ప్రతీకగా నిలుస్తోంది. తెలంగాణ తిరుపతిగా, పేదల ఇలవేల్పుగా పేరొందిన ఈ పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గోవింద నామస్మరణతో కొండకోనలు మారుమోగుతున్నాయి. అయితే ఈ క్షేత్ర వైభవం వెనుక ఏడు శతాబ్దాల చరిత్ర, ముక్కెర వంశీకుల అంకితభావం దాగి ఉన్నాయి.
వడ్డెమాన్‌లో ఉద్దాల తయారీ..
ప్రత్యేక సంప్రదాయం
కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల ఉత్సవానికి విశేష ప్రాధాన్యం ఉంది. స్వామివారికి సమర్పించే పాదుకలను ఉద్దాలుగా పిలుస్తారు. ఈ ఉత్సవానికి అవసరమైన ఉద్దాల తయారీకి వర్థమానపురం (ప్రస్తుత వడ్డెమాన్) చారిత్రకంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. కాకతీయుల కాలం నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయం నేటికీ భక్తులలో ఆసక్తి, భక్తిభావాలను నింపుతోంది. తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, ప్రత్యేక పూజల నడుమ ఉద్దాల సేవను నిర్వహించడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఉద్దాల సేవే బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి వివిధ రకాల వాహన సేవలు, విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వీటన్నింటిలో ఉద్దాల ఉత్సవం భక్తులకు అత్యంత పవిత్రమైన ఘట్టం. స్వామివారి పాదుకల సేవలో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, భక్తుల కోరికల నెరవేర్పును ఆకాంక్షిస్తూ ప్రత్యేక అర్చనలు, యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
భక్తులకు విస్తృత ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పాలక మండలి, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టాయి. ఉచిత దర్శనంతోపాటు తాగునీరు, అన్నదానం, ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏడు కొండలపై వెలసిన కురుమయ్యను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఏడు శతాబ్దాల చరిత్రకు నిదర్శనంగా.. తరతరాల రాజపోషణకు ప్రతిరూపంగా కురుమూర్తి క్షేత్ర వైభవం కొనసాగుతోంది.
ముక్కెర వంశీకుల అంకితభావంతోకొనసాగుతున్న కురుమయ్య సేవలు
గోపాల్‌రెడ్డి శకం నుంచి నేటికీ ఆధ్యాత్మిక సంప్రదాయం
వడ్డెమాన్‌లో ఉద్దాల తయారీకి శ్రీకారం


