కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతోనే కరువు విలయతాండవం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతోనే కరువు విలయతాండవం

Nov 12 2026 1:01 AM | Updated on Nov 12 2026 1:01 AM

హన్వాడ: కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం, సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం వల్లే రాష్ట్రంలో మళ్లీ కరువు పరిస్థితులు దాపురించి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. బుధవారం ఆయన మండలంలోని పుల్పోనిపల్లి, మహమ్మదాబాద్‌ మండలంలోని అన్నారెడ్డిపల్లి, కంచన్‌పల్లిలో ఎండిపోయిన పంటలను పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దెబ్బతిన్న పొలాల్లో తిరుగుతూ రైతులతో స్వయంగా మాట్లాడి వారి కష్టాలు, ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనలో వలసలను వెనక్కి రప్పించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తే, ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ, కేసీఆర్‌ హయాంలో నిర్మించిన రిజర్యాయర్లను ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90శాతం పూర్తయినా, మిగిలిన 10శాతం పనుల టెండర్లను రద్దు చేయడంతో కాల్వల ద్వారా రైతులకు నీరు అందకుండా పోయిందని మండిపడ్డారు. 800కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీళ్లు తీసుకెళ్లిన పాలకులు, మన పాలమూరులోని 8కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకు మాత్రం నీళ్లు అందించలేకపోయారని విమర్శించారు. కంచన్‌పల్లికి చెందిన రైతు వెంకటయ్య రెండున్నర ఎకరాల పంటను కాపాడుకోవడానికి రెండు తడుల నీటికోసం రూ.2.50లక్షలు అప్పు చేసి మూడు బోర్లు వేయించినా నీళ్లు పడక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని, ఇది పాలమూరు రైతాంగ దయనీయ స్థితికి అద్దం పడుతోందన్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలని, తక్షణమే రైతుబంధు విడుదల చేయాలని, పశువులకు ఉచితంగా పశుగ్రాసాన్ని పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి మాట్లాడుతూ.. పంటలు ఎండిపోతున్నా అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి నష్టాన్ని అంచనా వేయకపోవడం ఘోరమన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement