● అరెస్ట్.. రిమాండుకు తరలింపు
● 60గ్రాముల బంగారం, 110 తులాల వెండి నగలు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు
జడ్చర్ల: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను జడ్చర్ల పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలను వెళ్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. మండలంలోని మల్లెబోయిన్‌పల్లిలో ఫ్రిబవరి 28న కొమ్ము శ్రీనివాస్ అనే వ్యక్తి మృతిచెందడంతో దినవారాలు పూర్తయిన ప్రక్రియలో భాగంగా మృతుడి భార్య ధనలక్ష్మి, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి జడ్చర్లలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నిద్ర చేసేందుకు వెళ్లారు. నిద్ర అనంతరం తెల్లవారుజామున ఇంటికి చేరుకునేసరికి ఇంటి గేటు తాళంతోపాటు, ఇంటితలుపుల గడియలు తాళాలు విరగ్గొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో దాచిన దాదాపు 45 గ్రాముల బంగారంతోపాటు 70తులాల వెండి నగలు, కొంత నగదును దొంగలు అపహరించుకెళ్లారని జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం జడ్చర్లలోని గాంధీ చౌరస్తాలో తనిఖీలు చేస్తుండగా మండలంలోని నాగసాలకు చెందిన బోయ కృష్ణయ్య అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. దొంగతనాల గుట్టు బయటకు వచ్చింది. నిందితుడి నుంచి 62గ్రాముల బంగారం, 110 తులాల వెండినగలు స్వాధీనం చేసుకున్నారు. జడ్చర్ల, మిడ్జిల్, తిమ్మాజిపేట, భూత్పూర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలలో నేరస్థుడుగా ఉన్నాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ కమలాకర్, ఎస్‌ఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


