● నేటినుంచి 18 వరకు ప్రొసీడింగ్స్ పంపిణీ
● పింఛన్ల తుది జాబితా సిద్ధం చేసిన అధికారులు
● సర్టిఫికెట్లు వచ్చిన తర్వాతే దివ్యాంగుల దరఖాస్తుల పరిశీలన
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కొత్త చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు త్వరలో తీపికబురు అందనుంది. దీపావళి కానుకగా సీఎం రేవంత్‌రెడ్డి కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో జిల్లాలోనూ అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అర్హుల తుది జాబితాను సిద్ధం చేశారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 13,855 మందిని అర్హులుగా గుర్తించారు. తొలుత దరఖాస్తుల పరిశీలనలో కొందరి పేర్లు తిరస్కరణకు గురయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరోసారి పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగుల దరఖాస్తుల్లో కొన్నింటికి ఆమోదం లభించింది.
దివ్యాంగుల్లో ఉత్కంఠ
కొత్త పింఛన్లపై దివ్యాంగుల్లో ఉత్కంఠ నెలకొంది. సదరం ధ్రువపత్రాల గడువు ముగియడంతో పలువురు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. క్యాంపుల నిర్వహణలో జాప్యం, ధ్రువపత్రాల జారీ ఆలస్యం, గతంలో కంటే తక్కువ వైకల్య శాతం న మోదు కావడం వంటి కారణాలతో కొందరు అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సర్టిఫికెట్లు అందని వా రి దరఖాస్తులను అధికారులు హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం. ధ్రువపత్రాలు వచ్చిన తర్వాత మరోసా రి పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
వారం రోజుల పాటు ప్రొసీడింగ్స్ పంపిణీ
కొత్తగా మంజూరైన పింఛన్లకు సంబంధించి గురువారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయనున్నారు. మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జీఎంఆర్, అనిరుధ్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం 19, 20 తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ కానున్నట్లు సమాచారం.
ఈసారి పాత పింఛనేనా?
కొత్తగా మంజూరైన పింఛన్లకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆసరా పథకం మొత్తాలనే వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. వృద్ధులు, వితంతువులు, ఇతర అర్హులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున అందించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం కింద రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త పింఛన్లకు ఏ మొత్తాన్ని వర్తింపజేస్తారన్నది స్పష్టత రావాల్సి ఉంది.
జిల్లాలో 99,670 పింఛన్లు
ప్రస్తుతం జిల్లాలో అన్ని కేటగిరీలకు కలిపి 99,670 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరిలో వృద్ధులు 34,837 మంది, వితంతువులు 42,279, దివ్యాంగులు 13,091, చేనేత కార్మికులు 436, కల్లుగీత కార్మికులు 611, బీడీ కార్మికులు 1,711, ఒంటరి మహిళలు 4,251, హెచ్‌ఐవీ బాధితులు 2,202, పైలేరియా బాధితులు 49, డయాలసిస్ బాధితులు 203 మంది ఉన్నారు.
కొత్త లబ్ధిదారులు
తుది జాబితా సిద్ధం
కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న అన్ని రకాల దరఖాస్తుల పరిశీలన పూర్తి దశకు చేరుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు తుది జాబితా సిద్ధం చేస్తున్నాం. దివ్యాంగుల్లో కొందరికి సర్టిఫికెట్ అందలేదని వినతులు వచ్చాయి. వారిని హోల్డ్‌లో పెట్టి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత పరిశీలించనున్నాం. – నర్సింహులు, డీఆర్‌డీఓ


