పీయూ న్యాక్‌ గ్రేడ్‌ పెంపునకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పీయూ న్యాక్‌ గ్రేడ్‌ పెంపునకు కృషి చేయాలి

Nov 7 2026 12:48 AM | Updated on Nov 7 2026 12:48 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) న్యాక్‌ గ్రేడింగ్‌ మెరుగుపరిచేందుకు అధ్యాపకులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని వీసీ శ్రీనివాస్‌ సూచించారు. యూనివర్సిటీలో నిర్వహించిన న్యాక్‌ ఏక్యూఏఆర్‌, ఐక్యూఏసీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన, పరిశోధన, విద్యార్థుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో నాణ్యత పెంచేందుకు అన్ని విభాగాల వారు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు మాట్లాడుతూ న్యాక్‌ గ్రేడింగ్‌కు సంబంధించి నిర్ణీత గడువులోగా అవసరమైన ఆధారాలతో నివేదికలు సమర్పించాలని సూచించారు. అన్ని క్రైటీరియా కోఆర్డినేటర్లు, హెచ్‌ఓడీలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌, ప్రిన్సిపాళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అసంక్రమితవ్యాధులపై అప్రమత్తం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: అసంక్రమిత వ్యాధులపై అప్రమత్తత అవసరమని డీఎంహెచ్‌ఓ డా.శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ సమావేశహాల్‌లో జిల్లాలోని వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక రక్తపోటు, మధుమేహం, నోటి, బ్రెస్ట్‌, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను అదుపులో ఉంచేందుకు 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్‌ చేయాలన్నారు. పీహెచ్‌సీలలో సాధారణ కాన్పులు, ఓపీ సేవలు పెంచాలని ఆదేశించారు. ఇమూనైజేషన్‌, క్షయ నియంత్రణ, కుష్ఠు నిర్మూలన, మాతా–శిశు ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అనంతరం లెప్రసీ జాయింట్‌ డైరెక్టర్‌ (హైదరాబాద్‌) డా.జాన్‌బాబు మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి లక్షణాలున్న వారిని స్క్రీనింగ్‌ చేసి వైద్యాధికారులు నిర్ధారించిన తర్వాతే సంపూర్ణ చికిత్స ఉచితంగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.శశికాంత్‌, జిల్లా లెప్రసీ ప్రోగ్రాం అధికారి డా.రాజు, ఎంహెచ్‌ఎన్‌ ప్రోగ్రాం నోడల్‌ అధికారి డా.శివకాంత్‌, డా.పులి విద్య, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో ‘లైఫ్‌ సర్టిఫికెట్‌’ నమోదు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం వందమందికిపైగా ఆన్‌లైన్‌లో ‘లైఫ్‌ సర్టిఫికెట్‌’ను నమోదు చేయించారు. సంఘం గౌరవాధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌గౌడ్‌ ఇంటి వద్ద తపాల శాఖ సీనియర్‌ అధికారి సజ్జన్‌ బృందం ఈ ప్రక్రియ పూర్తి చేయించారు. నిబంధనల ప్రకారం ఏటా పీఎఫ్‌ కార్యాలయానికి ఈ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఇలా అందరివీ ఒకేసారి తాజాగా ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కొండాపూర్‌ భాస్కర్‌, దమాయపల్లి శ్రీను, విజయబాబు, కోడూరు శ్రీనివాస్‌, రెహమాన్‌, సుల్తాన్‌, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

బాదేపల్లి యార్డులో ధాన్యానికి రికార్డు ధర

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డు చరిత్రలో శుక్రవారం ధాన్యానికి రికార్డు స్థాయి ధర లభించింది. యార్డుకు 4307 బస్తాల ధాన్యం విక్రయానికి రాగా క్వింటా గరిష్టంగా రూ.3,866, కనిష్టంగా రూ.2,421 ధరలు లభించాయి. 988 బస్తాల మొక్కజొన్న రాగా గరిష్టంగా రూ.3180, కనిష్టంగా రూ.2851 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఎమ్‌ గరిష్టంగా రూ.2,909, కనిష్టంగా రూ.2,734గా ధరలు లభించాయి. మార్కెట్‌కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement