నాగశేషుడి వెండి విగ్రహం చోరీ | - | Sakshi
Sakshi News home page

నాగశేషుడి వెండి విగ్రహం చోరీ

Nov 6 2026 1:50 AM | Updated on Nov 6 2026 1:50 AM

కొత్తకోట రూరల్‌: కొత్తకోట మండలంలో వరుస చోరీలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా పాలెం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న మల్లినాథ్‌ బాబా ఆశ్రమంలోని శివాలయంలో నాగశేషుడి వెండి విగ్రహాన్ని బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. గురువారం ఉదయం ఆలయ తలుపులు తెరుచుకొని ఉండటంతో ఆందోళన చెందిన ఆలయ నిర్వాహకుడు బస్వరాజ్‌ రాజోలే లోపలికి వెళ్లి చూడగా.. ఆలయంలోని శివలింగంపై ఏర్పాటుచేసిన వెండి నాగపడగ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొత్తకోట ఎస్‌ఐ ఎం.విక్రమ్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్‌ టీంను రప్పించి, ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన వెండి పడగ మూడు కిలోల బరువు ఉంటుందని.. సుమారు రూ.2.25 లక్షల విలువ ఉంటుందని నిర్వాహకుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కార్పెంటర్‌ దుకాణంలో రూ.1.25 లక్షల చోరీ

గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న కార్పెంటర్‌ దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు రూ.1.25 లక్షల నగదును అపహరించారు. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. సయ్యద్‌ అనే వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో కార్పెంటర్‌ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటికి తలుపులు, కిటికీలు తయారు చేయించుకునేందుకు ఓ వ్యక్తి గురువారం రూ.1.25 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాడు. ఆ నగదును సయ్యద్‌ తన ప్యాంటు జేబులో పెట్టుకుని పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు దుకాణంలోకి చొరబడి జేబులోని నగదును అపహరించారు. కొద్దిసేపటి తర్వాత నగదును తీసేందుకు చూడగా కనిపించకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించాడు. గుర్తుతెలియని వ్యక్తులు నగదు అపహరించినట్లు గుర్తించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పట్టణ ఎస్‌ఐ శ్రీనివాస్‌ కేసు విచారణ చేపట్టారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో

ఇల్లు దగ్ధం

బల్మూర్‌: షార్ట్‌ సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమై సుమారు రూ.7లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన బల్మూరు మండలంలోని రాంనగర్‌లో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు కోట్ల సైదులు వివరాల మేరకు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు ఇల్లంతా వ్యాపించడంతో ఇటీవల పత్తి విక్ర యించగా వచ్చిన రూ. 1.80 లక్షల నగదుతో పాటు మూడు తులాల బంగారం, నిత్యావసర సరుకులు, ఫ్రిజ్‌, ఇతర గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అంతేకాకుండా మంటల వ్యాప్తికి ఇంటి పైకప్పు, గోడలు నెర్రలు బారాయి. దీంతో బాధిత కుటుంబానికి భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న ఆర్‌ఐ శివరామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సుమారు రూ.7 లక్షల మేర నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరారు.

క్రైస్తవ మిషనరీ ఆస్తులను ప్రభుత్వం కాపాడాలి

లక్డీకాపూల్‌: తెలంగాణలోని క్రైస్తవ మిషనరీ ఆస్తులను ప్రభుత్వం పరిరక్షించాలని మెన్నోనైట్‌ బ్రెదర్న్‌ ప్రాపర్టీ ప్రొటెక్షన్‌ అండ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. గురువారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో సొసైటీ ప్రధాన కార్యదర్శి బీఎన్‌ హోషయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు ప్రతినిధులు మాట్లాడారు. దేవాదాయ, వక్ఫ్‌, అసైన్డ్‌ భూముల కొనుగోలు, విక్రయాలు, లీజు, తనఖా వంటి వ్యవహారాలు చట్ట నిబంధనలకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. క్రైస్తవ మిషనరీలకు చెందిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు తమ సొసైటీ న్యాయపోరాటం చేస్తోందన్నారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లోని ఎంబీ చర్చి ఆస్తులకు సంబంధించి మార్గరెట్‌, ఆర్నాల్డ్‌, జాన్‌ వెస్లీ తదితరులపై వచ్చిన ఆరోపణలపై సీబీసీఐడీ లేదా సీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. జడ్చర్ల ము న్సిపాలిటీ పరిధిలోని ఎంబీ చర్చి భూములను బ్యాంకు వేలం పేరుతో అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని, అక్కడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని సాయిరెడ్డి వర్గంపై ఆరోపణలు చేశారు. క్రైస్తవ సమాజ సంక్షేమం, సేవలు, అభివృద్ధి కోసం కేటాయించిన ఆస్తులను స్వాధీనం చేసుకుని ఎంబీ ఆస్తుల పరిరక్షణ కమిటీకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జెరూసలెం మత్తయ్య, కేఎస్‌ ధన్‌రాజ్‌, గోపీ, ఏ.శ్రీనివాస్‌, డేవిడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement