● సదరన్ కమాండెంట్
బ్రిగేడియర్ ఎస్.రాజీవ్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): దేశాభివృద్ధిలో మాజీ సైనికులు ముందుండాలని సదరన్ కమాండెంట్ బ్రిగేడియర్ ఎస్.రాజీవ్ అన్నారు. సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రెడ్డి హాల్‌లో సైనిక మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా 110మంది వీరనారీలు, మాజీ సైనికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అనంతరం వైద్యశిబిరం నిర్వహించారు. అదే విధంగా దేశ రక్షణ కోసం జరిగిన యుద్ధాల్లో ప్రాణాలు అర్పించిన సైనికుల వీరనారీలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మాజీ సైనికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కాగా, మేళాకు 1,000 మందికి పైగా మాజీ సైనికులు హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షుడు వి.వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.నాగేశ్వర్, గౌరవాధ్యక్షుడు ఎంఆర్‌కే రెడ్డి, సలహాదారు కె.వెంకటయ్యగౌడ్, కోశాధికారి రాజవర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రాములు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


