● విజేతలుగా నాగర్‌కర్నూల్ బాలికలు, నారాయణపేట బాలుర జట్లు
ఉప్పునుంతల: మండలంలోని వెల్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 70వ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–17 బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా కొనసాగింది. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల నుంచి 5 బాలుర, బాలికలు జట్లు ఈ పోటీకి హాజరయ్యాయి. ఉత్కంఠ భరితంగా సాగిన పోటీల్లో నాగర్‌కర్నూల్ బాలికలు, నారాయణపేట బాలుర జట్లు విజేతలుగా నిలువగా.. మెమోంటోలను అందజేశారు. పోటీల ప్రారంభోత్సవంలో ఉమ్మడి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ సెక్రెటరీ కురుమూర్తిగౌడ్, ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ గంగాధరి మల్లేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడాకారుల్లో మానసికంగా ధృడంగా ఉండి, గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచు చింతోజి వెంకటేష్, బూసిరాజు మల్లయ్య, ఎల్‌బీ స్టేడియం కబడ్డీ కోచ్ జ్యోతిశ్వర్, ఆయా జిల్లాల ఎస్‌జీఎఫ్ సెక్రెటరీలు నాగేశ్వరావు, వెంకటప్ప, నర్సింహ, కురుమూర్తి, హెచ్‌ఎం ఆంజనేయులు, పీడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


