ఊట్కూర్: మక్తల్, నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా మంగళవారం ఊట్కూర్ పెద్ద చెరువు వద్ద ఓపెన్‌కెనాల్ పనులను డీఓ గోపాలాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైపులైన్ నుంచి ఊట్కూర్ ప్రధాన చెరువు వరకు సుమారు 2 కి.మీ.ల ఓపెన్ కెనాల్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాల్వ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వం భూసేకరణ చేపట్టి 59 ఎకరాల భూమిని సేకరించి రైతులకు నష్టపరిహారం అందించిందని తెలిపారు. నాలుగు నెలల్లో పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్‌కుమార్, ఆర్‌ఐ కృష్ణారెడ్డి, ఏఈలు రాఘవేంద్రారెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ రంగన్న తదితరులు పాల్గొన్నారు.
పనులను అడ్డుకున్న బీఆర్‌ఎస్ నాయకులు
ఓపెన్ కెనాల్ పనులు ప్రారంభమయ్యాయన్న విషయాన్ని తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు పనుల వద్దకు వచ్చి అడ్డుకున్నారు. ఊట్కూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలని పూర్తి స్థాయిలో భూనిర్వాసితులకు నష్టపరిహారాన్ని అందించాలని, డీపీఆర్‌ను విడుదల చేయాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అశోక్‌కుమార్ ఘటనా స్థలానికి వచ్చి బీఆర్‌ఎస్ నాయకులతో చర్చించి శాంతింపజేశారు. పూర్తిస్థాయిలో భూ నిర్వాసితులందరికీ నష్టపరిహారాన్ని చెల్లిస్తామని గ్రామసభ ఏర్పాటు చేసి డీపీఆర్‌ను విడుదల చేస్తామని ముంపు గ్రామంపై అధికారులతో చర్చించి ప్రజలకు అవగాహన కలిపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు శివరాజురెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రహెమాన్, బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు మోనప్ప, తరున్‌రెడ్డి, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.


