జీవనశైలి మార్పులతో సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం | - | Sakshi
Sakshi News home page

జీవనశైలి మార్పులతో సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం

Nov 3 2026 1:45 AM | Updated on Nov 3 2026 1:45 AM

● అమెరికా అంతర్జాతీయ సదస్సులో ఉమ్మడి పాలమూరు నుంచి తొలిసారి డాక్టర్‌ ప్రతిభకు ప్రాతినిధ్యం

● ఐఎంఏ ఆధ్వర్యంలో ఘన సన్మానం

పాలమూరు: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గి సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నాయని సుశ్రుత ప్రజావైద్యశాల గైనకాలజిస్టు డాక్టర్‌ ప్రతిభ తెలిపారు. అమెరికాలోని మేరీల్యాండ్‌ రాష్ట్రం బాల్టిమోర్‌లో అక్టోబర్‌ 24 నుంచి 28 వరకు జరిగిన అమెరికన్‌ సొసైటీ ఫర్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్‌ (ఏఎస్‌ఆర్‌ఎం–2026) సైంటిఫిక్‌ కాంగ్రెస్‌ అండ్‌ ఎక్స్‌పో సదస్సులో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గైనకాలజీ విభాగంలో తొలిసారిగా ఆమె ప్రాతినిధ్యం వహించారు. 110 దేశాల నుంచి సుమారు 8 వేల మంది వైద్య ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో దాదాపు గంటపాటు ప్రసంగించే అవకాశం లభించిందని ఆమె తెలిపారు. సంతానోత్పత్తి చికిత్సల్లో డిజిటల్‌ టూల్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వినియోగం, పురుషుల్లో సంతానలేమి సమస్యలు, అండాల నిల్వ, ఎండోమెట్రియోసిస్‌, గర్భాశయ సమస్యలపై చర్చించినట్లు వెల్లడించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ పలువురు పురుషులు శుక్రకణాల లోపాలు, జన్యుపరమైన సమస్యలతో సంతానోత్పత్తి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి సమస్యలు ఉన్న దంపతులు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలని సూచించారు. క్యాన్సర్‌ బాధిత మహిళల అండాలను భద్రపరిచి చికిత్స అనంతరం వినియోగించే విధానాలు, గర్భాశయ మార్పిడి, ఐవీఎఫ్‌ వంటి ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. సోమవారం ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతరం ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ రాంమోహన్‌ డాక్టర్‌ ప్రతిభను సన్మానించారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, డాక్టర్‌ ఆదిత్య శ్రీ సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement