● రాష్ట్ర విజిలెన్స్ అధికారుల బృందం
ఆకస్మిక తనిఖీలు
● శ్రీసాయిలక్ష్మి వెంకటేశ్వర పారా బాయిల్డ్ ఇండస్ట్రీలో వెలుగు చూసిన అక్రమం
● జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ ఫిర్యాదు.. కేసు నమోదు
కల్వకుర్తి రూరల్: ప్రభుత్వం సీఎమ్మార్ కోసం ఇచ్చిన రూ.25 కోట్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన సంఘటన కల్వకుర్తిలో కలకలం రేపింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన విజిలెన్స్ అధికారి కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బృందం సభ్యులు కల్వకుర్తి సమీపంలోని రఘుపతిపేట రోడ్డులో ఉన్న శ్రీసాయిలక్ష్మి వెంకటేశ్వర పారా బాయిల్డ్ ఇండస్ట్రీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో ప్రభుత్వానికి చెందిన ధాన్యంలో 8,505.586 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఆర్థిక విలువ ప్రకారం రూ.25,04,42,985 కోట్లుగా తనిఖీలలో నిర్ధారించారు. ప్రభుత్వ ధాన్యాన్ని అప్పగించిన ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేసి ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ దండు రాజేందర్ విలేకరులకు చెప్పారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు తనిఖీలు జరపగా ధాన్యం పక్కదారి పట్టినట్లు తేలిందన్నారు. ప్రభుత్వ ధాన్యం అక్రమ మళ్లింపు, ప్రజా పంపిణీ వ్యవస్థకు నష్టం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు మిల్లు యజమానులపై నిత్యావసర సరుకుల చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కల్వకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మేనేజర్ వెల్లడించారు. ఈ విషయమై కల్వకుర్తి ఎస్‌ఐ కురుమూర్తి మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు మిల్లు యజమానులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


