రైతులు ఉత్సాహంగా తరలిరావాలి
● ఉమ్మడి పాలమూరు నుంచి 470 బస్సుల్లో రైతుల తరలింపు
● కొడంగల్ నియోజకవర్గం
హకీంపేటలో నవంబర్ 7, 8, 9 తేదీల్లో
మెగా రైతు మేళా
● 200 స్టాళ్లలో ఆధునిక సాగు పద్ధతులు, యంత్రాల ప్రదర్శన
● చివరి రోజు సీఎం రేవంత్‌రెడ్డి రాక
నాగర్‌కర్నూల్: ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం మెగా రైతుమేళాకు ఏర్పాట్లు చేస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌లో నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ మేళా నిర్వహించనున్నారు. చివరిరోజు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల నుంచి 23,500 మంది రైతులను తరలించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం 470 బస్సులను కేటాయించారు. ఈ మేరకు జిల్లాలకు ఉత్తర్వులు అందడంతో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లాలతోపాటు మరో ఐదు జిల్లాల నుంచి కూడా సుమారు 25 వేల మందికిపైగా రైతులు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో
మండలాల వారీగా ఏర్పాట్లు
జిల్లాలోని 20 మండలాల రైతులను మేళాకు తీసుకెళ్లేందుకు 50 బస్సులను కేటాయించారు. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట మండలాలకు నాలుగు చొప్పున బస్సులు కేటాయించగా.. వంగూరు, పెద్దకొత్తపల్లి, ఉర్కొండ మండలాలకు మూడు చొప్పున ఏర్పాటు చేశారు. మిగిలిన మండలాలకు ఒకటి లేదా రెండు బస్సులు కేటాయించారు. ఒక్కో బస్సులో 50 మంది రైతులను తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. రైతుల రవాణాతోపాటు భోజన వసతిని కూడా ప్రభుత్వమే కల్పించనుంది.
200 స్టాళ్లలో
ఆధునిక సాగు పద్ధతుల ప్రదర్శన
రైతు మేళాలో వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో సుమారు 200 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, నూతన సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. పంటల సాగులో ఉత్పాదకత పెంచడం, పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, తక్కువ ఖర్చుతో మెరుగైన దిగుబడులు సాధించే విధానాలను వివరించనున్నారు. నవంబర్ 7, 8 తేదీల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు.
రైతులకు అన్ని సౌకర్యాలు
మూడు రోజుల పాటు జరిగే మేళాకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు రానున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా రవాణా, భోజనం, తాగునీరు, వైద్య సేవలు, పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. రైతులు వివిధ స్టాళ్లను సందర్శించి వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక యంత్రాల వినియోగం, నూతన సాగు విధానాలపై అవగాహన పెంచుకునేలా చర్యలు చేపడుతున్నారు.
రైతులను హకీంపేటకు తరలించేందుకు జిల్లాల మధ్య దూరం, మండలాలు, గ్రామ పంచాయతీల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రవాణా ప్రణాళిక సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 16 మండలాలు, 441 గ్రామ పంచాయతీల పరిధిలోని రైతుల కోసం 120 బస్సులు కేటాయించారు. వీటి ద్వారా 6 వేల మందిని తరలించనున్నారు. నారాయణపేట జిల్లా నుంచి 11 మండలాలు, 280 గ్రామ పంచాయతీల పరిధిలోని 10 వేల మంది రైతులను 200 బస్సుల్లో తీసుకెళ్లనున్నారు. వనపర్తి జిల్లా నుంచి 14 మండలాలు, 255 గ్రామ పంచాయతీల పరిధిలోని 2,500 మంది రైతులకు 50 బస్సులు కేటాయించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాలు, 461 గ్రామ పంచాయతీల నుంచి 2,500 మందిని మరో 50 బస్సుల్లో తరలించనున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి 255 గ్రామ పంచాయతీల పరిధిలోని 2,500 మంది రైతులకు 50 బస్సులు ఏర్పాటు చేశారు. ఇలా ఐదు జిల్లాల నుంచి మొత్తం 470 బస్సుల్లో 23,500 మంది రైతులను తరలించనున్నారు.
హకీంపేటలో జరిగే మెగా రైతు మేళాకు నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి 50 బస్సుల్లో 2,500 మంది రైతులను తరలించాలని నిర్ణయించాం. నవంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో అదే రోజు రైతులను మేళాకు తీసుకెళ్తాం. ఇప్పటికే మండలాల వారీగా బస్సులు కేటాయించాం. ఒక్కో బస్సులో 50 మంది రైతులను మాత్రమే తరలించేలా ఏర్పాట్లు చేశాం. రైతుల రవాణా, భోజన వసతులను ప్రభుత్వమే కల్పిస్తుంది. రైతులంతా ఉత్సాహంగా మేళాకు తరలివచ్చి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, యంత్రాల వినియోగంపై అవగాహన పొందాలి.
– యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి, నాగర్‌కర్నూల్


