ఆర్డీఎస్‌ ఆనకట్టను బ్యారేజీగా మార్చాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్డీఎస్‌ ఆనకట్టను బ్యారేజీగా మార్చాలి

Nov 2 2026 12:35 AM | Updated on Nov 2 2026 12:35 AM

అలంపూర్‌: రైతాంగాన్ని ఆదుకోవడానికి ఆర్డీఎస్‌ ఆనకట్టను బ్యారేజీగా మార్చాలని ఉమ్మడి జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన సమితి జిల్లా జేఏసీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, అలంపూర్‌ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్‌ రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు. అలంపూర్‌ చౌరస్తాలోని వైష్ణవి స్కూల్‌ ఆవరణలో ఆర్డీఎస్‌, పెండింగ్‌ ప్రాజెక్టులు, సాగునీటి సాధనకు రైతు మహాసదస్సును ఉమ్మడి మహబుబ్‌ నగర్‌ పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జేఏసీ చైర్మన్‌, అలంపూర్‌ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్లు మాట్లాడుతూ.. రైతులకు సాగు నీటిని అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అందులో భాగంగా ఆర్డీఎస్‌ ఆనకట్టను బ్యారేజీగా నిర్మించాలన్నారు. కర్ణాటక సరిహద్దు దాటే వరకు తూములు లేకుండా కాల్వల నిర్మాణం చేపట్టాలన్నారు. తెలంగాణ సరిహద్దులో తూములు నిర్మించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నారు. సుంకేసుల నుంచి ఏపీకి ఎంత నీటిని తరలిస్తున్నారో ఆదే స్థాయిలో ఆర్డీఎస్‌ ద్వారా తెలంగాణ రైతులకు సాగునీరు అందించి నడిగడ్డ రైతులకు న్యాయం చేయాలన్నారు. సుంకేసుల బ్యారేజీ వద్ద ఉన్న 32వ వెంట్‌ తెరవాలన్నారు. ఏపీలో నిర్మిస్తున్న గుండ్రేవుల రిజర్వాయర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించవద్దన్నారు. బీచుపల్లి–వెల్టూరు–గొందిమల్ల బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వార పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకోనే విధంగా దాని సామర్థ్యాన్ని పెంచి రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్నారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ ద్వారా ఆర్డీఎస్‌ కాల్వలకు లింకు కలిపి సాగునీటిని అందించాలన్నారు. ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టులో ఉన్న ఉండవెల్లి మండలంలోని మారమునగాల–ప్రాగటూరు మధ్య కృష్ణానదిపై ఎత్తిపోతల పథకం నిర్మించాలన్నారు. ఎత్తిపోతల పథకం నిర్మించి ఆర్డీఎస్‌ కాల్వల ద్వారా రైతులకు సాగునీటిని అందించాలన్నారు. డిండి ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సాగునీటి నిర్వాహణకు లస్కర్లను నియమించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement