క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలి

Oct 27 2026 12:44 AM | Updated on Oct 27 2026 12:44 AM

ఉత్సాహంగా మ్యాచ్‌లు

● ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది:

గద్వాల కలెక్టర్‌

● రాష్ట్రస్థాయి అండర్‌–17

బాలుర క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

గద్వాల న్యూటౌన్‌: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని అలవర్చుకో వాలని గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అ న్నారు. ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న 70వ రాష్ట్రస్థాయి అండర్‌–17 బాలుర క్రికెట్‌ టోర్నీ ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని బ్యాటింగ్‌ చేసి వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలకు చెందిన పది జట్లు టోర్నీలో పాల్గొనడం గద్వాలకు గర్వకారణమన్నారు. క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందించడంతో పాటు మానసికోల్లాసం, శారీరక దారుఢ్యాన్ని అందిస్తాయని తెలిపారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, నాలుగు రోజుల పాటు జరిగే పోటీల్లో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి, డిసెంబర్‌ రెండో వారంలో గ్వాలియర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపించనున్నట్లు వెల్లడించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి మాట్లాడుతూ క్రీడలు యువత శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల పరిశీలకుడు డేవిడ్‌సన్‌, ఇన్‌చార్జి డీవైఎస్‌ఓ రామలింగేశ్వర్‌గౌడ్‌, డీఈఓ విజయలక్ష్మి, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, స్టేడియం ఇన్‌చార్జి బషీర్‌, శిక్షకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

టోర్నీ తొలిరోజు మూడు మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. ఒక్కో మ్యాచ్‌ను 12 ఓవర్లకు నిర్వహించారు. వరంగల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కరీంనగర్‌ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కరీంనగర్‌ ఏడు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఐదు వికెట్లు కోల్పోయి 85 పరుగులకే పరిమితమైంది. మరోమ్యాచ్‌లో నిజామాబాద్‌పై నల్లగొండ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలత బ్యాటింగ్‌ చేసిన నిజామాబాద్‌ ఆరు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేయగా.. నల్లగొండ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మూడో మ్యాచ్‌లో ఖమ్మం పది పరుగుల తేడాతో రంగారెడ్డిపై నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఖమ్మం ఆరు వికెట్ల కోల్పోయి 86 పరుగులు చేయగా, రంగారెడ్డి 76/5కే పరిమితమై ఓటమి పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement