● దొంగను పట్టుకున్న శాంతినగర్ పోలీసులు
● 10తులాల బంగారం,
కిలో వెండి స్వాధీనం
● వివరాలు వెల్లడించిన
డీఎస్పీ మొగిలయ్య
రాజోళి: కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ, పోలీసులకు అంతుచిక్కకుండా ఉన్న దొంగను శాంతిగనర్ పోలీసులు మెరుపు ఆపరేషన్ చేసి 12రోజుల వ్యవధిలోనే పట్టుకున్నారు. జిల్లాలో ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా భారీగా బంగారం చోరీ చేసిన దొంగను సోమవారం పోలీసులు పట్టుకోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఈనెల 14న వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్‌లో జరిగిన భారీ దోపిడి గురించి డీఎస్పీ మొగిలయ్య శాంతినగర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 14న శాంతినగర్‌లో నివాసముంటున్న తోట మాధవరావు ఇంట్లో అందరూ ఫంక్షన్‌కు వెళ్లడం గమనించిన రాయలసీమ ప్రాంతంలోని కల్యాణదుర్గం ప్రాంతానికి చెందిన వడ్డేఫీట్ల గంగాధర్ అలియాస్ సాంబ ఆ ఇంట్లోకి చొరబడి 20 తులాల బంగారం, కేజీ వెండి అపహరించాడు. ఈ ఘటన పట్టణంతోపాటు జిల్లాలో సంచలనం రేకేత్తించింది. ఈ ఘటనను చాలెంజ్‌గా తీసుకున్న శాంతిగనర్ పోలీసులు.. ఎస్పీ శ్రీనివాస్‌రావు ఆదేశాల మేరకు సీఐ శంకర్, ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బృందంగా ఏర్పడి, దర్యాప్తు ముమ్మరం చేశారు. తరుచూ చోరీలకు పాల్పడుతున్నవారు, జైలు నుంచి విడదలైనవారి వివరాలు సేకరించారు. ఆ క్రమంలో నిందితుడు గంగాధర్ ఈ ఏడాది జూన్‌లో జైలనుంచి విడుదలయ్యాడు. ఆయన కదలికలపై దృష్టిపెట్టిన పోలీసులకు పలు అనుమానాలు రావడంతో, ఆ దిశగా.. విచారణ చేపట్టారు. చోరీకి గురైన ఇంటి పరిసరాల్లో ఎక్కువగా సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ, కొద్ది సమీపంలో ఉన్న ఒక్క కెమెరాతోపాటు, పోలీసులు సేకరించిన దొంగతనాలకు పాల్పడుతున్న పాతనేరస్తుల వివరాలతో చోరీకి పాల్పడుతున్న నిందితుడిపై నిఘా పెట్టారు. ప్రత్యేక బృందంతో తనఖీలు చేపడుతుండగా.. అలంపూర్ చౌరస్తా దగ్గర సోమవారం దొంగను పట్టుకున్నారు. 20తులాల బంగారం అపహరించగా, 10 తులాల బంగారు, కేజీ వెండిని స్వాధీనం చేసుకున్నామని, మరికొంత బంగారంను ఆయా బ్యాంకుల్లో వివిధ వ్యక్తుల పేర్లతో మార్టిగేజ్ చేసి డబ్బులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కల్యాణదుర్గానికి చెందిన శైలజ తాను చోరీ చేసిన బంగారాన్ని ఇస్తాడని, ఆమె ద్వారా మరొక నలుగురు వ్యక్తులు బ్యాంకుల్లో మార్టిగేజ్ చేస్తున్నారని, వారిపై కూడా నిఘా పెట్టినట్లు తెలిపారు. నిందితుడి మీద కర్ణాటక, తెలంగాణ, ఏపీలో సుమారు 50 దాకా చోరీకేసులు ఉన్నాయని, ఎలాంటి సెల్‌ఫోన్, బైక్ వాడకుండా, ఆర్‌టీసీ బస్సులోనే సంచరిస్తూ చోరీలకు పాల్పడుతుంటాడని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చురుగ్గా పాత్ర పోషించిన సీఐ, ఎస్‌ఐతోపాటు సిబ్బంది గోవిందు, అయ్యన్న, ప్రసాద్, నభి, రసూల్‌ను అభినందించారు. వారికి రివార్డు కూడా ఉంటుందని తెలిపారు.


