కల్వకుర్తి రూరల్: రాజ్యాధికారంతోనే బీసీల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తేల్చి చెప్పారు. రాజ్యాధికార పాదయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి యాత్ర కల్వకుర్తికి చేరుకుంది. పట్టణంలోని శివాజీ చౌక్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. 70ఏళ్లు పాలించిన పాలకులు బీసీలను అనగదొక్కారని ఆరోపించారు. ఇక వారి ఆటలు చెల్లవని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఎన్నికలకు ముందు బీసీల అభివృద్ధికి రూ.20వేల కోట్లు కేటాయించడంతోపాటు రిజర్వేషన్ల శాతం పెంచుతామని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేశారని విమర్శించారు. ఇక వీరి కల్లబొల్లి మాటలు బీసీలు నమ్మరు అన్నారు. రెడ్లు, వెలమల ఓట్లు మాకు వద్దు మేము మీకు వేసేది లేదని ప్రజలతోని చెప్పించారు. బీసీలకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి వచ్చిన వెంటనే దోపిడీదారుల నుంచి లాక్కొని కోటి ఎకరాల భూమిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పంపిణీ చేస్తానన్నారు. రాజ్యాధికారం వస్తే హక్కులు వస్తాయని ప్రతిఒక్కరూ రాబోయే ఎన్నికల్లో బీసీలకు ఓట్లు వేసి అధికారంలోకి వచ్చేలా చూడాలని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మల్లన్నకు పలువురు వినతిపత్రాలు అందజేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు నష్టం కలిగిస్తున్న డిండి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే నిలిపివేసేలా చూసి ఈ ప్రాంత రైతులకు న్యాయం చేయాలని జేఏసీ నాయకుడు సదానందంగౌడ్ కోరారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మదన్‌మోహన్, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, కల్వకుర్తి తాలుకాల అధ్యక్షులు ఈశ్వర్, సదానందం గౌడ్, రాజేందర్, జంగయ్య, ఆంజనేయులుతోపాటు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.


