● పాలమూరుకు కేసీఆర్ ఉరి వేస్తే..
రేవంత్ ఉచ్చు బిగిస్తున్నారు
● నల్లగొండ నీటి సమస్యకు అనేక
ప్రత్యామ్నాయ మార్గాలు
● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
పాలమూరు: గతంలో సీఎం కేసీఆర్ పాలమూరుకు ఉరితాడు వేస్తే.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఉచ్చు బిగిస్తున్నారని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. డిండి ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని పాల మూరు రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో పదేపదే మాట్లాడుతూ పాలమూరు రైతులను రెచ్చగొట్టేధోరణి మానుకోవాలని, రెండు జిల్లాల ప్రజల మధ్య ఘర్షణలు తలెత్తేలా వ్యవహరించవద్దని గుత్తా సుఖేందర్‌రెడ్డికి సూచించారు.ఆదివారం నగరంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. డిండి ప్రాజెక్టు ద్వారా 0.6 టీఎంసీల నీటిని తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనివల్ల పాలమూరు రైతులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నీటి సమస్య పరిష్కారానికి నక్కలగండి, నాగార్జునసాగర్, ఎస్‌ఎల్‌బీసీ, మల్లన్నసాగర్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని చెప్పారు. ఫ్లోరైడ్ సమస్యను సాకుగా చూపి పాలమూరు నీటి హక్కులకు భంగం కలిగించవద్దన్నారు. రెండు జిల్లాల రైతులు, ప్రజల మధ్య వైరం పెరిగేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు లక్ష్యం గతంలోనే దెబ్బతిన్నదని డీకే అరుణ ఆరోపించారు. జూరాల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్‌వాటర్ ద్వారా నీటిని తీసుకునేలా అప్రోచ్ మార్చినప్పుడే ప్రాజెక్టు అసలు ఉద్దేశం దెబ్బతిందన్నారు. జీవో 72లో డిండి ద్వారా నీటిని తరలించే అంశం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్టులు, కమిషన్లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుల పూర్తిపై లేదని విమర్శించారు. గత మూడేళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని, జూరాల మరమ్మతులకు సైతం నిధులు కేటాయించలేదని ఆరోపించారు. డిండి ప్రాజెక్టు రద్దు కోసం బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని, త్వరలో పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులను సందర్శిస్తామని వెల్లడించారు. సమావేశంలో బీజేపీ నాయకులు వీర బ్రహ్మచారి, ప్రభాకర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


