వరిలో కాండం తొలుచు పురుగు నివారణ | - | Sakshi
Sakshi News home page

వరిలో కాండం తొలుచు పురుగు నివారణ

Oct 24 2026 9:20 AM | Updated on Oct 24 2026 9:20 AM

పంటలో నివారణ చర్యలు

అలంపూర్‌: వరిలో నారు నుంచి పైరు పాలుపోసుకోనే దశ వరకు కాండం తొలుచే పురుగు ఆశిస్తుంది. ఇది సోకిన ప్రాథమిక దశ నుంచే నివారణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జునరెడ్డి సూచించారు. ఈ పురుగునే మొవ్వ పురుగుగాను పిలుస్తారు. ఈ పురుగు ఆశిస్తే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీని నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏఓ సూచించారు.

పురుగు జీవిత చక్రం

తల్లి పురుగు కనీసం 300 గుడ్ల వరకు పెడుతుంది. ఒక్కొక్క గుంపులో 20 నుంచి 80 గుడ్లు ఉంటాయి. ఈ గుడ్లు 5 నుంచి 7 రోజుల్లో పొదిగి పురుగులు బయటికి వస్తాయి. లార్వా దశ పూర్తి కాలం 30 నుంచి 40 రోజులు ఉంటుంది. పూర్తి జీవిత చక్రం 70 రోజుల్లో పూర్తవుతుంది.

నష్టపరిచే విధానం

పంట చిరు పొట్ట ఏర్పడిన తర్వాత పురుగు ఆశిస్తే వెన్నులో నుంచి గింజలకు పోషకాలు అందక అవి తాలుగా మారుతాయి. తల్లి రెక్కల పురుగు గుడ్లను ఆకు చివరిపై భాగంలో గుంపులుగా పెట్టి ఉదరం చివర గల వెంట్రుకలతో కప్పి ఉంచుతుంది. ఈ పురుగులు గుంపులుగా మొక్క పైభాగంలో చేరి ఆకు తొడిమపై నున్న పత్రహరితాన్ని తింటాయి. పూర్తిగా ఎదిగిన పురుగు వరి కాండంలో కోశస్త దశకు చేరుకుంటాయి.

● పైరు పిలకలు వేసే దశలో గుడ్ల నుంచి వెలుబడిన వెంటనే మొదట దశ పిల్ల పురుగులు ఆకు కొమ్మకు చేరుకొని అక్కడ పత్రహరితాన్ని తింటాయి.

● పంటలో ఈ పురుగు చేసే నష్టం వలన మొక్క ఆకులు తెల్లని చారలుగా ఏర్పడతాయి.

● ఈ పురుగు కాండం లోపలికి చేరి కణజాలాన్ని తినటం వలన మువ్వ ఆకులు విడిపడక మువ్వ కోళ్లు ఏర్పడుతుంది.

నారు మడి నుంచే జాగ్రత్తలు

నారు తీయడానికి వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్‌ గుళికలు సెంటు నారుమడికి 170 గ్రాములు చొప్పున నీటిలో ఇసుక కలిపి నారుమడిలో చల్లుకోవాలి. నారు నాటేటప్పుడు నారు చివర్లు తుంచి వేయాలి.

వరి పిలకలు తొడిగే దశలో లీటరు నీటికి 2 మి.లీ క్లోరోఫైరిపాస్‌ కలిపి పిచికారీ చేసుకోవాలి. అంకురం దశలో 10 నుంచి 15 రోజుల సమయంలో ఎకరానికి 8 కిలోల కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ గుళికలు చల్లుకోవాలి. పురుగు మందులైతే క్లోరో ఫైరిపాస్‌ 2 మి.మీ, అసిఫేట్‌ 1.5 గ్రాములు, కార్టాప్‌ హైడ్రో క్లోరైడ్‌ 2.0 గ్రాములు లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement