మహబూబ్‌నగర్ క్రైం: నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పీ డి.జానకి అధికారులను ఆదేశించారు. రద్దీ సమయాల్లో ప్రధాన కూడళ్ల వద్ద సిబ్బంది కేటాయించిన పాయింట్లలో తప్పక విధులు నిర్వహించాలని సూచించారు. బుధవారం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ వార్షికంగా తనిఖీ చేశారు. జనరల్ డైరీ, కేసు రికార్డులు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, పెండింగ్ కేసులు, ఈ–చలాన్లు, వాహనాల తనిఖీలు, రోడ్డు ప్రమాదాలు, కోర్టు కేసులు, బీట్ డ్యూటీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ట్రాఫిక్ ఉల్లంఘనల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో భాగంగా వాయు కాలుష్యం, దుమ్ము, పొగకు గురయ్యే అవకాశం ఉన్నందున సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు పాల్గొన్నారు.
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు
శాంతిభద్రతలు, ప్రజా ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని గురువారం నుంచి ఈ నెల 31 వరకు జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. ముందస్తు పోలీస్ అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


