నల్లులు ఆశించడానికి పరిస్థితులు
అలంపూర్: పంటల సాగుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వరి పంటసాగుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వరిపంటపై ఆకునల్లి, కంకినల్లి ఆశిస్తున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు సూచించారు. ఈ నల్లులు కంటికి కనపడకుండా ఉండే చిరుజీవులని తెలిపారు. పరిస్థితులు అనుకూలించనప్పుడు ఉధృతిని పెంచుకొని వరి పంటను నష్టపరుస్తాయి పేర్కొన్నారు. వరి సాగుపై పలు విషయాలను వెల్లడించారు.
ఆకునల్లి: బూడిద తెలుపు రంగులో ఉండే నల్లి పురు గులు. ఆకుల వెనక భాగంలో, మధ్య ఈనెల వెంబడి గుడ్లను పెడతాయి. ఒక్కొక్క ఆడ నల్లి 20–80 గుడ్లను పెడుతుంది. నాలుగైదు రోజుల్లో గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటికి వస్తాయి. వీటి జీవిత కాలం 9 నుంచి 13 రోజులు. ఈ నల్లి పురుగులు ఆకుల వెనక భాగం నుంచి రసాన్ని పీల్చివేయడంతో చిన్న చిన్న తెల్లటి మచ్చలు పొడవుగా కనిపిస్తాయి. వీటి ఉధృతి ఎక్కువైనప్పుడు తెల్ల మచ్చలన్నీ ఏకమై ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. దీనితో కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. మొక్కలు గిడసబారుతాయి.
నివారణ: ఈ నల్లి నివారణకు డైకోఫాల్ 5 మి.లీ లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగంలో తడిచేలా పిచికారి చేయాలి.
కంకినల్లి: ఈ నల్లి తెలుపు రంగులో ఉంటుంది. గుంపులు, గుంపులుగా ఆకు తొడిమ పై భాగంలోని కణజాలంలో మధ్య ఈనెల కింద భాగంలోని కణజాలంలో చేరి రసాన్ని పీల్చి వేస్తాయి. తద్వార మధ్య ఈనె నిలువుగా ఊదా రంగు చారలు తొడిమ మీద ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి. వీటి ఉధృతి పెరిగితే మచ్చల విస్తీర్ణం పెరుగుతుంది. కొన్ని సమయాల్లో ఆకులపై నుంచి రసాన్ని పీల్చేయడంతో ఆకులపై పసుపు రంగు చారలు చారలు ఏర్పడతాయి. వెన్ను అభివృద్ధి చెందే దిశలో ఈ నల్లులు గింజలోకి చేరి అండాశయాన్ని, పుప్పుడిని ఆశించడంతో తాలుగా మారుతాయి. గింజలను వివిధ శిలీంధ్రాలు ఆశించడంలో నల్లగా మారుతాయి. వీటి ఉధృతి ఎక్కువగా ఉంటే వెన్ను సరిగా బయటకు వెలుబడదు. ఖరీఫ్ వరిపై దీని ప్రభావం ఎక్కువ. ఒక్కొక్క ఆడనల్లి 50 గుడ్లను పెడుతుంది. జీవిత కాలం 6 నుంచి 10 రోజులు ఉంటుంది.
నివారణ: ప్రొఫినోఫాస్ 2.మి.లీ, డైకోఫాల్ 5 మి.లీ, డైపెంధిరాన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పంట 40–45 రోజుల మధ్యలో తప్పనిసరిగా పిచికారి చేసుకోవాలి.
తక్కువ వర్షపాతం
అధిక తేమ, ఉష్ణోగ్రతలు
మబ్బులతో కూడిన వాతావరణం
అధిక నత్రజని వాడకం
పాడి–పంట


