ఓట్లు మనవి.. అధికారం మనదే | - | Sakshi
Sakshi News home page

ఓట్లు మనవి.. అధికారం మనదే

Sep 30 2026 1:04 AM | Updated on Sep 30 2026 1:04 AM

● బీసీ రాజ్యాధికారమే లక్ష్యం:

తీన్మార్‌ మల్లన్న

నారాయణపేట: బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలని, బీసీ రాజ్యాధికారాన్ని సాధించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. టీఆర్‌పీ చేపట్టిన మహాపాదయాత్ర 13వ రోజు నారాయణపేటకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. నారాయణపేట నియోజకవర్గంలో బీసీల జనాభా అధికంగా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం తగిన స్థాయిలో లేదన్నారు. నియోజకవర్గంలో 2.32 లక్షల ఓట్లు ఉండగా, బీసీల ఓట్లు సుమారు 1.56 లక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ముదిరాజుల ఓట్లే దాదాపు 60 వేల మంది ఉన్నారని చెప్పారు. మాదిగ సామాజికవర్గానికి 33 వేల ఓట్లు ఉన్నాయని, రెడ్డి సామాజికవర్గానికి 10,652 ఓట్లు ఉన్నాయన్నారు. సంఖ్యాపరంగా అధికంగా ఉన్న బీసీలు రాజకీయంగా ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘నారాయణపేటలో అసలు ఎమ్మెల్యే ఎవరో... డూప్లికేట్‌ ఎమ్మెల్యేలు ఎవరో ప్రజలకు అర్థం కావడం లేదని, ఒక్కరిని గెలిపిస్తే నారాయణపేటలో నలుగురు ఎమ్మెల్యేలు అయిండ్రంటా.. ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి ఉంది’’ అని ప్రజలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. బీసీలకు పనులు కావడం లేదని, రెడ్డి సామాజికవర్గానికి చెందినవారి పనులకే ప్రాధాన్యం దక్కుతోందని ఆరోపించారు. నారాయణపేటలో బీసీ రాజ్యాధికార ఉద్యమాన్ని బలపరచాలని, బీసీల ఓట్లతోనే బీసీల రాజ్యాధికారం రావాలన్నారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం ఎమ్మెల్యే స్థాయి నుంచే పెరగాలని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ ప్రకటించిన బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, బీసీలకు న్యాయం జరిగేలా తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ముదిరాజ్‌లకు బీసీ–ఏలో చోటు కల్పించేందుకు కృషి చేస్తామని, ఎస్సీ వర్గాలకు సముచిత గౌరవం కల్పిస్తామని చెప్పారు.‘బీసీలు బిచ్చగాళ్లు కాదు.. బిగ్‌బాస్‌లు’ అని పేర్కొంటూ బీసీలు ఆత్మవిశ్వాసంతో రాజకీయంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో టీఆర్‌పీ నాయకులు అశోక్‌, శివవీర్‌రెడ్డి, మడివల్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement