మానవపాడు: యువకుడు అనారోగ్యంతో బాధపడు తూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువా రం మండలంలోని చెన్ని పాడులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ స్వాతి తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తెలుగు నాగేంద్ర(33) హమాలీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. కొన్ని రోజులుగా గుండెనొప్పి, నడుమునొప్పితో బాధపడుతూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం మనస్థాపానికి గురై భార్య పొలం పనికి వెళ్లగానే ఇంటి పైకప్పునకు కొండికి చీరతో ఉరి వేసుకున్నాడు. ఇంటి పక్కనే ఉన్న బోయ సుజాత గమనించి మృతుని భార్య మానసకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఆమె హుటహుటిన ఇంటికి వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. భర్త మరణంపై ఎవరిపైనా ఎటువంటి అనుమానం లేదని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
క్యాన్సర్ నొప్పి భరించలేక వృద్ధుడి ఆత్మహత్య
తిమ్మాజిపేట: క్యాన్సర్‌తో బాధపడుతూ నొప్పిని భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. బావాజిపల్లికి చెందిన దాసరి తిరుపతయ్య (60) రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆ నొప్పి భరించలేక ఈ నెల 22న తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి కుమారుడు దాసరి శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అదృశ్యమైన బాలుడు
నీటి గుంతలో పడి మృతి
వెల్దండ: మండలంలోని కొట్రతండా సమీపంలోని వ్యవసాయం పొలంలో నివాసం ఉండే బీహర్‌కు చెందిన బాలుడు ఆర్యన్(8) నీటిగుంతలో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ యుగందర్‌రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీహర్ రాష్ట్రానికి చెందిన దంపతులు సావిత్రి, గౌతమ్‌సింగ్‌లు పశువుల షెడ్ పనిచేస్తు కుటుంబంతో అక్కడే ఉంటున్నారు. ఈనెల 22న ఆర్యన్ కనిపించకుండా పోవడంతో చుట్టు పక్కల వెతికిన కన్పించలేదు. దీంతో ఈనెల 23న వెల్దండ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎస్‌ఐతో పాటు సిబ్బంది సమీప వ్యవసాయ పొలాల్లో గాలింపు చేపట్టగా కొట్రతండా సమీపంలోని రైతు అమితేష్ పొలంలోని నీటిగుంతలో బాలుడు శవం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ అనుమతితో కల్వకుర్తిలో బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు చేసినట్లు పోలీసులు వివరించారు.
పెట్రోల్ పోసి.. నిప్పంటించి దారుణ హత్య
మరికల్: నిద్రిస్తున్న వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పటించి దారుణ హత్యకు పాల్పడ్డ ఘటన గురువారం మాధవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మరికల్ మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన తాలపల్లి బాలస్వామి (46) కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి భోజనం ముగించుకొని ఇంట్లో నిద్రించాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి బాలస్వామిని హత్య చేయాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోసి నిప్పంటించారు. తేరుకున్న కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే 90 శాతం కాలిన శరీరంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి 7 గంటలకు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, హత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ రాంలాల్‌నాయక్ తెలిపారు.
షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
● రూ.4 లక్షల ఆస్తి నష్టం
కల్వకుర్తి రూరల్: షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమై రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని రఘుపతి పేట గ్రామ పంచాయతీ పరిధిలోని రామగిరిలో షార్ట్‌సర్క్యూట్ సంభవించి ఇంట్లో ఉన్న సిలిండర్ పేలింది. దీంతో ఇల్లు దగ్ధమైంది. రూ.4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటనలో ఇంటి పైకప్పు రేకులు ఎగిరి పడి ఒకరికి గాయాలయ్యాయి. బాధితుడు రామగిరికి చెందిన మద్దిలేటి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.


