ఆర్‌బీఎస్‌కే బృందాల కంటి పరీక్షల్లో వెలుగుచూస్తున్న సమస్యలు
కళ్లపై భారం..
–8లో u
‘జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని ఆర్‌బీఎస్‌కే వైద్య బృందాలు నాలుగు రోజులుగా (మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో) 31 ప్రభుత్వ
పాఠశాలల్లో 5,236 మంది విద్యార్థులకు దూరపు చూపు, దగ్గర చూపు సమస్యలతోపాటు ఇతర
కంటి సమస్యలపై పరీక్షలు నిర్వహించారు. కాగా.. ఇందులో 270 మంది విద్యార్థులకు సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.’
జిల్లాలో నాలుగో విడత కింద 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తున్నాం. మొత్తం 7 బృందాలు రోజుకు ఒకటి లేదా రెండు పాఠశాలల్లో పరీక్షలు చేయడం జరుగుతుంది. గతంలో స్క్రీనింగ్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు అద్దాలు పంపిణీ చేస్తున్నాం. కంటి సమస్య తీవ్రంగా ఉంటే జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నాం. డిసెంబర్ నాటికి లక్ష్యం పూర్తిచేసి అందరికీ పరీక్షలు చేస్తాం.
– డాక్టర్ ప్రవీణ్, ఆర్‌బీఎస్‌కే నోడల్ ఆఫీసర్
చిన్న వయసులో కంటిచూపు సమస్య వస్తే మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుత పిల్లల్లో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటే చదువు లేకపోతే స్మార్ట్‌ఫోన్ లేదా టీవీలు చూస్తున్నారు. ఫోన్‌లో ఒక రీల్‌ను కనీసం ఒక నిమిషం కూడా చూడకుండా నచ్చకుంటే సెకన్ల వ్యవధిలో స్క్రోల్ చేస్తున్నారు. దీంతో ఇదే పద్ధతిని వారి సబ్జెక్టుల్లో కూడా చూపుతారు. సబ్జెక్టు నచ్చకపోతే దానిని పట్టించుకోరు. ఓపిక తగ్గిపోయి గట్టిగా అరవడం, గదుల్లో భయంగా గడుపుతుంటారు. చిన్నారులు అన్నిరకాల స్క్రీనింగ్ సమయం పూర్తిగా తగ్గించాలి. పెద్ద టీవీలను తక్కువ లైటింగ్‌లో అస్సలు చూడరాదు. ప్రధానంగా చీకటిలో దుప్పటి కప్పుకొని ఫోన్ చూస్తే దాని ప్రభావం రెండింతలు ఉంటుంది.
– కిషోర్‌కుమార్, ఎంఎస్ ఆప్తమాలజిస్ట్
పాలమూరు: లోకజ్ఞానం కూడా తెలియని చిన్నారులు పలువురు వివిధ కారణాలతో చూపు మందగించి ఇబ్బందులు పడుతున్నారు. పిన్న వయసులోనే కళ్లద్దాలు ధరించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల 15 నుంచి ఆర్‌బీఎస్‌కే (రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం) వైద్య బృందాలు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెలుగుచూసింది. దృష్టిలోపాలకు గురైన వారికి అవసరమైన చికిత్స అందించడంతోపాటు అద్దాలు అవసరమైన వారిని గుర్తిస్తున్నారు. ఇక సమస్య తీవ్రంగా ఉంటే జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు.
నాలుగో దశ పరీక్షలు..
జిల్లాలో గతేడాది కాలంలో మూడు దశలుగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మొదటి దశలో 12,674 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా 786 మందికి కంటి సమస్య ఉన్నట్లు గుర్తించి అద్దాలు పంపిణీ చేశారు. ఇక రెండో దశలో 46,415 మందికి పరీక్షలు చేయగా 1,486 మంది విద్యార్థులు రెండు రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించి.. అద్దాలు అందిస్తున్నారు. మూడో దశలో 53,274 మందికి పరీక్షలు చేయగా 2,305 మందికి సమస్య ఉన్నట్లు గుర్తించి ప్రస్తుత ప్రక్రియలో అద్దాలు పంపిణీ చేస్తున్నారు. మూడు దశల్లో కలిపి మొత్తం 1,12,362 మందికి పరీక్షలు చేయగా 4,577 మంది కంటి సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం నాలుగో దశలో భాగంగా కంటి పరీక్షల ప్రక్రియ ప్రారంభం కాగా.. 251 పాఠశాలల్లో 42,280 మంది విద్యార్థులకు ఈ డిసెంబర్ నాటికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
ఇప్పటి వరకు మూడు దశల్లో 1,12,363 మందికి పరీక్షలు
4,577 విద్యార్థులకు
కంటి సమస్య ఉన్నట్లు గుర్తింపు
ఈ నెల 15 నుంచి మొదలైన
నాలుగో దశ ప్రక్రియ
స్మార్ట్‌ఫోన్లు, టీవీ స్క్రీన్‌తో
కంటిచూపుపై ప్రభావం


